Pawan kalyan: విశాఖలో పెట్టుబడుల సదస్సు.. ‘జనసేన వెల్‌కమ్’ అంటూ పవన్‌ ట్వీట్‌!

Vizag global Investors summit: రెండ్రోజుల పాటు జరిగే పెట్టుబడుల సదస్సు సమయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలూ చేయబోమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. తనకు రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొన్నారు.

Published : 02 Mar 2023 21:59 IST

అమరావతి: విశాఖపట్నం వేదికగా రెండ్రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ (Global Investors Summit) వేళ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan) తన స్పందన తెలియజేశారు. పెట్టుబడుల సదస్సుకు విచ్చేస్తున్న పెట్టుబడిదారులకు జనసేన తరఫున స్వాగతం పలుకుతున్నట్లు పేర్కొన్నారు. ఏపీలోని అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని వారిని కోరారు. వైకాపా సర్కారు సైతం పెట్టుబడి దారుల్లో విశ్వాసం కల్పించాలని సూచించారు. సదస్సు గురించి ఎలాంటి విమర్శలూ చేయబోమని, తనకు రాజకీయాల కంటే ఏపీ భవిష్యత్తే ముఖ్యమని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రం వరుస ట్వీట్లు చేశారు.

‘‘ప్రకృతి అందాలతో అలరారే విశాఖ నగరానికి దేశ విదేశాల నుంచి వస్తున్న పెట్టుబడిదారులందరికీ జనసేన స్వాగతం పలుకుతోంది. మా శక్తివంతమైన, అనుభవం కలిగిన ఆంధ్రప్రదేశ్ యువత మిమ్మల్ని మెప్పిస్తారని భావిస్తున్నాను. ఈ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ ద్వారా రాష్ట్రానికి మంచి భవిష్యత్‌, మన యువతకు ఉపాధిని అందించే అవకాశం కల్పించడంతోపాటు ఇన్వెస్టర్లు కూడా తమ పెట్టుబడులకు తగిన ప్రతిఫలం పొందుతారని ఆశిస్తున్నా’’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

ఈ సందర్భంగా వైకాపా సర్కారుకు పవన్‌ కొన్ని సూచనలు చేశారు. ‘‘వైకాపా ప్రభుత్వానికి నా హృదయపూర్వక విన్నపం. ఏపీలో ఆర్థికవృద్ధికి ఉన్న అవకాశాలు, శక్తివంతమైన మానవ వనరులు, ఖనిజ సంపద, సముద్రతీరం వంటి వాటిని ఇన్వెస్టర్లకు సవివరంగా వివరించండి. రివర్స్‌ టెండరింగ్‌, మధ్యవర్తుల కమీషన్లు వంటి అడ్డంకులు ఏవీ లేకుండా పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కలిగించండి. ఈ సమ్మిట్‌ ఆలోచనలను కేవలం వైజాగ్‌కే పరిమితం చేయకండి. తిరుపతి, అమరావతి, అనంతపురం, కాకినాడ, శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడప.. ఇలా ఏపీలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న అభివృద్ధి అవకాశాలను కూడా ఇన్వెస్టర్లకు వివరించండి. దీన్ని కేవలం ఒక నగరానికే పరిమితం చేయకుండా ఏపీ మొత్తానికి నిజమైన ఇన్వెస్టర్ల సమ్మిట్‌ లాగా మార్చండి’’ అని విజ్ఞప్తి చేశారు.

‘‘రానున్న రెండు రోజులు  ప్రభుత్వంపై జనసేన ఎలాంటి విమర్శలకు చోటివ్వదు. ఇన్వెస్టర్ల సమ్మిట్‌ విషయంలో ప్రభుత్వంపై ఎటువంటి రాజకీయ విమర్శలు చేయం. పెట్టుబడుల ఆకర్షణ అంశంలో ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు అందిస్తాం. ఇన్వెస్టర్ల సమ్మిట్‌ సందర్భంగా ప్రభుత్వానికి జనసేన శుభాకాంక్షలు తెలియచేస్తోంది. రాజకీయం కంటే రాష్ట్రం ముఖ్యం’’ అని పవన్‌ కల్యాణ్‌ ట్వీట్‌ చేశారు. 3, 4 తేదీల్లో జరిగే గ్లోబల్‌ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ కు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని