Updated : 25 May 2022 16:00 IST

Janasena: ఆనాడే అంబేడ్కర్‌ పేరు పెట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు: పవన్‌ కల్యాణ్‌

మంగళగిరి: కోనసీమ ప్రాంతానికి రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ పేరు పెట్టారని.. జిల్లాలకు కొత్త పేర్లు పెట్టేటప్పుడే అంబేడ్కర్‌ పేరు కూడా పెడితే బాగుండేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అభిప్రాయపడ్డారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుంచి పవన్‌ కల్యాణ్‌ మీడియాతో మాట్లాడారు. ఆనాడే అంబేడ్కర్‌ పేరు పెట్టి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టడంలో ప్రభుత్వం ఎందుకు జాప్యం చేసిందో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు సాధారణంగా కొంత వ్యతిరేకత ఉంటుందన్నారు. అయితే పేర్లు పెట్టేటప్పుడు ప్రభుత్వం సున్నితంగా వ్యవహరించాల్సిందని పవన్‌ అభిప్రాయపడ్డారు.

గొడవలు జరగాలనే అభ్యంతరాలకు సమయం ఇచ్చారా?

‘‘రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములును ఒక జిల్లాకు కుదించారు. ఆంధ్ర రాష్ట్రానికి గుండెకాయ లాంటి వ్యక్తిని జిల్లాకు పరిమితం చేశారు. కృష్ణా నది తక్కువగా ఉన్న చోట కృష్ణా జిల్లా పేరు పెట్టారు. కృష్ణా నది ఎక్కువగా ఉన్న చోట ఎన్టీఆర్‌ జిల్లా అని పెట్టారు. జిల్లాల పేర్లకు వ్యతిరేకమైనా.. వ్యక్తులకు వ్యతిరేకం కాదు. మిగతా జిల్లాలతో పాటు కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ అని పెడితే సహజంగా ఉండేది. అభ్యంతరాలు ఉంటే 30 రోజులు సమయం ఇస్తున్నామన్నారు. మిగతా జిల్లాలకు సమయం ఇవ్వకుండా కోనసీమకే ఎందుకు సమయమిచ్చారు? గొడవలు జరగాలనే అభ్యంతరాలకు సమయం ఇచ్చారా?30 రోజుల సమయమిచ్చి కలెక్టరేట్‌కు రమ్మని చెప్పారు. సామూహికంగా కాదు.. వ్యక్తులుగా రావాలని సూచించారు. ఇది ముమ్మాటికీ వ్యక్తులను టార్గెట్‌ చేయడమేనని జనసేన భావిస్తోంది. 30 రోజుల గడువు ఎందుకు? గొడవలు జరగాలని కాదా? మంత్రి విశ్వరూప్‌ ఇంటిపై దాడి జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఊరుకుంటారా? పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారంటే ఏమనుకోవాలి?దాడి జరుగుతుంటే ఇంటికి రక్షణగా ఉండాలి కదా? విశ్వరూప్‌ ఇంటిపై దాడికి ముందు మంత్రి కుటుంబసభ్యులను తరలించారు. ముందే తరలించారంటే దాడి జరుగుతుందని పోలీసులకు ముందే తెలుసా? పోలీసులకు ముందే తెలిసినా బందోబస్తు పెట్టలేదంటే ఏమనాలి?ఘోరాలను ఆపకుండా జరిగేలా చేస్తారా? పైపెచ్చు జనసేనపై ఆరోపణలు చేస్తూ కులసమీకరణపై రాజకీయాలు చేస్తున్నారు. భావోద్వేగాలు ఉంటాయని తెలిసే రెచ్చగొట్టారు’’ అని పవన్‌ ఆరోపించారు.

ప్రజల దృష్టిని మళ్లించడంలో జగన్‌ నేర్పరి..

మూడు రోజుల క్రితం వైకాపా ఎమ్మెల్సీ.. తన డ్రైవర్‌ను చంపేశారు. చంపి వాళ్ల ఇంటికే వెళ్లి మృతదేహం అప్పగిస్తారా?మృతుడు ఎస్సీ వ్యక్తి కావడంతో వ్యతిరేకత వచ్చింది. ప్రజల దృష్టి మళ్లించేందుకే కోనసీమలో గొడవలు రేపారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడంలో సీఎం జగన్‌ నేర్పరి. అమలాపురం విధ్వంసంలో కీలకంగా వ్యవహరించిన అన్యం సాయి వైకాపా నేతే. వాస్తవాలు స్పష్టంగా ఉంటే హోంమంత్రి విపక్షాలపై నిందలు వేస్తారా? సజ్జల, విశ్వరూప్‌తో అన్యం సాయి ఉన్న ఫొటోలు అచ్చెన్నాయుడు విడుదల చేశారు. కోనసీమకే పేరు పెట్టడం వెనుక ప్రభుత్వ ఆలోచన ఏంటి? కడప జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టొచ్చు కదా? కులాల మధ్య ఘర్షణ రావణకాష్టం లాంటిది. కులాల పేరుతో గొడవలు జరిగితే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదు. వైకాపా ప్రభుత్వం బాధ్యత వహించాలి. యువత ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఇలాంటి వారి ఉచ్చులో పడొద్దని మనవి చేస్తున్నాను. వైకాపా నేతలు గొడవలు తగ్గించే ప్రయత్నం చేయండి. సజ్జల వంటి పెద్దల అనుభవం కుల ఘర్షణలకు కారణం కాకూడదు’’ అని పవన్‌ కోరారు.

రెఫరెండం పెట్టండి..

‘‘కోనసీమ ఘటన ఒక కులానికి సంబంధించినది కాదు. కోనసీమ ప్రజలు సంయమనంగా ఉండాలి. అంబేడ్కర్‌ వంటి మహనీయుడిని జిల్లాకు పరిమితం చేస్తారా? రాజకీయ లబ్ధికోసం అంబేడ్కర్‌ పేరును వాడుకుంటున్నారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టే విషయంలో రెఫరెండం పెట్టండి. కోనసీమ ప్రజల అభిప్రాయాలను కూడా తీసుకోండి’’ అని పవన్‌ ప్రభుత్వాన్ని కోరారు.     


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని