Pawan kalyan: మెగా డీఎస్సీ ఎప్పుడు?.. నిరుద్యోగ సమస్యపై యాక్షన్‌ ప్లాన్‌ ఉందా?: పవన్‌

ఏపీలో 30లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు.. వాళ్ల సమస్యల్ని పరిష్కరించేందుకు వైకాపా ప్రభుత్వానికి కార్యాచరణ ఉందా?అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. రాష్ట్రంలోని యువత ఉద్యోగ ....

Updated : 11 Feb 2022 18:12 IST

అమరావతి: ఏపీలో దాదాపు 30లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు.. వాళ్ల సమస్యల్ని పరిష్కరించేందుకు వైకాపా ప్రభుత్వానికి కార్యాచరణ ఉందా?అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. రాష్ట్రంలోని యువత ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడంతో నిరాశానిస్పృహలతో ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘అధికారంలోకి వచ్చాక న్యూ ఇయర్‌ గ్రీటింగ్స్‌తో పాటు జాబ్‌ క్యాలెండర్‌ ఇచ్చేస్తా.. ఏటా 6వేల పోలీసు ఉద్యోగాలు, పాతికవేల టీచర్‌ ఉద్యోగాలు ఇస్తా అంటూ ముద్దులు పెట్టిమరీ చెప్పారు. మెగా డీఎస్సీ లేదు.. పోలీసు ఉద్యోగాల భర్తీలేదు. గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 ఉద్యోగాల నోటిఫికేషన్లు రావడంలేదు. పరిపాలనలోకి వచ్చిన రెండేళ్ల తరవాత 10వేల ఉద్యోగాలతో క్యాలెండర్‌ వేశారు.. అవి ఇప్పటికీ భర్తీకాలేదు. నిరాశానిస్పృహలతో నిరుద్యోగ యువత ఆందోళన చెందుతున్నారు. అధికారంలోకి వచ్చేందుకు హామీలు ఇచ్చారు. ఇప్పుడు వాటిని నెరవేర్చడం మరచిపోయారు. మాకు ఉద్యోగాలేవీ అని కలెక్టరేట్ల దగ్గరకు వెళ్లి యువత అడిగితే లాఠీఛార్జీలు చేయించి అరెస్టులు చేస్తున్నారు. రాష్ట్రంలో 30లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్లకు ఉద్యోగాలు కల్పించేందుకు అవసరమైన యాక్షన్‌ ప్లాన్‌ అనేది ఈ ప్రభుత్వం వద్ద ఉందా?’’ అని పవన్‌ ప్రశ్నించారు.

‘‘నిరుద్యోగ యువతకు మేలు చేసే విధంగా ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల కోసం సీఎం ఎన్ని సమీక్షా సమావేశాలు నిర్వహించారు? వాటిలో నిర్ణయాలు ఏమిటి?అమలు ఎంతవరకు వచ్చిందో యువతకు వైకాపా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మెగా డీఎస్సీ ప్రకటన ఎప్పుడు చేస్తారు? 6వేల పోలీసు ఉద్యోగాల భర్తీ ఎప్పుడు జరుగుతుందో తెలియజేయాలి. బీఈడీ చేసి టీచర్‌ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వాళ్లు.. వివిధ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్నవాళ్లు నోటిఫికేషన్లు లేకపోవడంతో వయో పరిమితి దాటిపోతోందనే ఆందోళనలో బతుకుతున్నారు. యువత ఆందోళన ఈ ప్రభుత్వానికి అర్థమవుతోందా? అర్థమైనా అర్థంకానట్టుగా ఉందా అనే సందేహం కలుగుతోంది. ఉద్యోగాలు, ఉపాధి కల్పన అంటే తమవాళ్లకు సలహాదారు పోస్టులు ఇచ్చుకోవడం, వాటిని పొడిగించడం కాదని పాలకులు గుర్తించాలి’’ అని ప్రభుత్వానికి హితవుపలికారు.

సీఎం కేవలం హీరోలతోనే కూర్చుంటారా?: నాదెండ్ల

సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారంపై సమావేశానికి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను ఎందుకు ఆహ్వానించలేదని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ ప్రశ్నించారు. సమస్యలను తనకు తానుగా సృష్టించి వాటి పరిష్కారానికి తన వద్దకు రావాల్సిందేనన్నట్లు సీఎం వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘విశాఖ రావాలని సినీ పెద్దలను ఆహ్వానించిన సీఎం జగన్‌కు అమరావతి రైతులు కనిపించలేదా? పక్కనే ఉన్న రైతులను పిలిపించుకొని అమరావతిపై మాట్లాడలేరా? ఎప్పుడైనా అమరావతి రైతులతో సమస్య పరిష్కారంపై చర్చించా? ఒక పాలసీ గురించి మాట్లాడుతున్నప్పుడు డిస్ట్రిబ్యూటర్లతో ఎందుకు కూర్చోలేదు. సీఎం కేవలం హీరోలతోనే కూర్చుంటారా? డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను కూడా ఆహ్వానించి వారికి తగిన గౌరవం కల్పించలేదు. ఇసుక పాలసీ గురించి ఎప్పుడైనా మాట్లాడారా? అన్నిటికన్నా ప్రధాన సమస్యలాగా దీనికంత పబ్లిసిటీ ఇచ్చుకొని హడావుడిగా అందరినీ పిలిపించుకొని సమస్య పరిష్కారం నా చేతులమీదుగా జరగాల్సిందే అన్నట్టుగా ముఖ్యమంత్రి వ్యవహరించారు’’ అని మనోహర్‌ మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని