Pawan kalyan: అత్యాచార ఘటనలు ఆగకపోతే హైకోర్టు సుమోటోగా తీసుకోవాలి: పవన్‌ కల్యాణ్‌

ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా జరుగుతున్న అత్యాచార ఘటనలను నియంత్రించడంలో పాలకులు విఫలమైనందున పోలీసు ఉన్నతాధికారులే వాటిని కట్టడి చేయాలని జనసేన

Published : 07 May 2022 01:32 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా జరుగుతున్న అత్యాచార ఘటనలను నియంత్రించడంలో పాలకులు విఫలమయ్యారని ఇక పోలీసు ఉన్నతాధికారులే వాటిని కట్టడి చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రంలో నిత్యం ఏదో ఒకచోట మహిళలపై అత్యాచారాలు, దాడులు జరుగుతుండటం అత్యంత దురదృష్టకరమన్నారు. పసివాళ్లపైనా, గర్భిణులపై, మానసిక పరిణతిలేని వారిపై, విద్యార్థినులపై, యువతులపై వరుసగా అత్యాచారాలు జరగటం ఆవేదన కలిగిస్తోందని తెలిపారు. ఇది చాలా తీవ్రమైన విషయమని అత్యాచార ఘటనలు ఆగకపోతే హైకోర్టు సుమోటోగా తీసుకుని, మహిళల రక్షణకై ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

‘‘వైకాపా ప్రభుత్వం ఎలాగూ ఆడబిడ్డలను కాపాడలేదు. తమ బిడ్డలను మృగాళ్ల బారినపడకుండా తల్లిదండ్రులే కంటికిరెప్పలా కాపాడుకోవాలి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచార ఘటన గురించి ఎంతో బాధపడ్డాను. మహిళలకు రక్షణ కల్పించి వారు ధైర్యంగా తిరిగే పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వాన్ని మేం నిందించడం లేదు.. సూచన మాత్రమే చేస్తున్నాం. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచాలని చట్టం చెబుతున్నా.. పాలకులు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. బాధ్యత గల హోదాల్లో ఉన్నవారే తల్లిదండ్రుల పెంపకాన్ని తప్పుబట్టేలా మాట్లాడటం సరికాదు. ప్రస్తుతం పాలకులను విశ్వసించేలా పరిస్థితులు లేవు. అందుకే బాధ్యత కలిగిన పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బందే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అత్యాచారాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. అసలు ఇలాంటి సంఘటనలు ఎందుకు చోటు చేసుకొంటున్నాయి, ఎలా కట్టడి చేయాలనే అంశంపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష చేయకపోవడం దురదృష్టకరం’’ అని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని