Pawan Kalyan: ఆ జీవోలు రద్దు చేస్తేనే విద్యార్థుల ఆందోళనకు ఫలితం: పవన్‌ కల్యాణ్‌

ఎయిడెడ్‌ విద్యాసంస్థల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన నాలుగు జీవోలను రద్దు చేస్తేనే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చేస్తున్న ఆందోళనకు ఫలితం ఉంటుందని జనసేన

Published : 14 Nov 2021 01:17 IST

అమరావతి: ఎయిడెడ్‌ విద్యాసంస్థల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన నాలుగు జీవోలను రద్దు చేస్తేనే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చేస్తున్న ఆందోళనకు ఫలితం ఉంటుందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. ‘‘తమ బిడ్డలు చదువుతున్న విద్యా సంస్థలను ఎప్పటిలాగే కొనసాగించాలని, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ద్వారా ఆ విద్యాసంస్థల నిర్వహణ సాగేలా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అనంతపురం, కాకినాడ, విజయవాడ, విశాఖపట్నం.. ఇలా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో విద్యార్థులు రోడ్డు మీదకు వచ్చి ప్రభుత్వ నిర్ణయం వల్ల తాము చదివే కాలేజీలు, స్కూళ్లు ప్రైవేటు విధానంలోకి వెళ్తే ఫీజులు భరించలేమని చెబుతున్నారు. విద్యార్థుల ఆందోళనకు తలొగ్గినట్టు కనిపించిన ప్రభుత్వం మెమో ద్వారా ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు ఆప్షన్లు ఇచ్చామని ప్రకటన చేసినా అందులో మతలబులే కనిపిస్తున్నాయి. ఆప్షన్ల పేరుతో విద్యార్థులను, తల్లిదండ్రులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 

ఎయిడ్‌డె విద్యాసంస్థల నిర్వాహకులకు ఇచ్చిన వాటిలో మొదటి రెండింటినీ బలంగా ప్రభుత్వం చెబుతోందంటే కచ్చితంగా ప్రభుత్వ నాలుగు జీవోల ద్వారా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉందని అర్థమవుతోంది. నాలుగు మార్గాలు చెప్పాం... విద్యాసంస్థల నిర్వాహకులు ఏదో ఒకటి ఎంచుకుంటారు అంటూ విద్యాశాఖ తన బాధ్యత నుంచి తప్పించుకోకూడదు. ఎప్పటిలాగే ఎయిడెడ్‌ విద్యాసంస్థలు కొనసాగాలంటే జీవో 42, 50, 51, 19లను పూర్తిగా రద్దు చేయాలి. 1982 నాటి విద్యాహక్కు చట్టానికి విరుద్ధంగా ఉన్న ఈ జీవోలను రద్దు చేయడంతో పాటు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కొనసాగించి ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి’’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని