Pawan kalyan: రైతుల సమస్యలు పరిష్కరించలేని వ్యవస్థలెందుకు?: పవన్‌ కల్యాణ్‌

గుంటూరు జిల్లా జొన్నలగడ్డలో రైతు ఆంజనేయులు ఆత్మహత్య తనను తీవ్రంగా కలచివేసిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించలేని వ్యవస్థలు, ఆ వ్యవస్థలకు అధికారులుగా ఐఏఎస్‌లు ఉండి ఏం లాభమని ప్రశ్నించారు. ఆన్‌లైన్‌లో భూమి వివరాలు సరిచేయాలని...

Published : 19 Apr 2022 02:28 IST

విజయవాడ: గుంటూరు జిల్లా జొన్నలగడ్డలో రైతు ఆంజనేయులు ఆత్మహత్య తనను తీవ్రంగా కలచివేసిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించలేని వ్యవస్థలు, ఆ వ్యవస్థలకు అధికారులుగా ఐఏఎస్‌లు ఉండి ఏం లాభమని ప్రశ్నించారు. ఆన్‌లైన్‌లో భూమి వివరాలు సరిచేయాలని నాలుగేళ్లుగా తిరుగుతున్నా అధికారులు స్పందించకపోవడాన్ని పవన్‌ తప్పుబట్టారు. రైతు పురుగుల మందు డబ్బాతో వెళ్లి నేరుగా కలెక్టర్‌ను కలిసి తన సమస్య చెప్పినా పరిష్కారం కాలేదన్నారు. భూమి వివరాలను పాస్ పుస్తకంలో పొరపాటుగా నమోదు చేయడమే తప్పయితే... దాన్ని సరిచేయకుండా రైతులను తమ చుట్టూ తిప్పించుకొంటున్న అధికారుల ధోరణిని కచ్చితంగా తప్పుబట్టాల్సిందేనన్నారు. రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం వల్లే తరచుగా అన్నదాతలు మానసిక క్షోభకు గురవుతున్నారని ధ్వజమెత్తారు. రెవెన్యూ శాఖను ప్రక్షాలన చేసి రైతుల సమస్యలను తీర్చటంపై పాలకులు దృష్టి సారించటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంజనేయులు ఆత్మహత్యతోనైనా రెవెన్యూ శాఖలో మార్పు రావాలని ఆకాంక్షించారు. కలెక్టర్ ఆదేశించినా పని చేయని వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పవన్‌ డిమాండ్ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని