Published : 25 May 2022 01:17 IST

Pawan kalyan: అనంతబాబుకు పోలీసుల గౌరవమర్యాదలు.. ఆశ్చర్యాన్ని కలిగించాయి: పవన్‌ కల్యాణ్‌

అమరావతి: కాకినాడలో ఎస్సీ యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో పోలీసుల వ్యవహార శైలి తనను విస్మయానికి గురి చేసిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. సుబ్రహ్మణ్యంను తానే హత్య చేసినట్లు ఎమ్మెల్సీ అనంతబాబు ఒప్పుకున్న తర్వాత కూడా ఆయన పట్ల పోలీసులు కనబరిచిన గౌరవమర్యాదలు ఆశ్చర్యాన్ని కలిగించాయని తెలిపారు. సామాన్యుల పట్ల కూడా పోలీసులు ఇలాగే సహృదయత కనబరుస్తారా? అని ప్రశ్నించారు. పోలీసుల తీరుకు వారిపై ఆధిపత్యం చెలాయిస్తున్న రాజకీయ బాసులే కారణమని విమర్శించారు. నేరాలకు పాల్పడేవారికి వత్తాసు పలికేలా అధికార యంత్రాంగాన్ని పాలకులు వినియోగించుకొంటుంటే ఇక శాంతిభద్రతల గురించి ఆలోచన కూడా చేయలేమని ఆక్షేపించారు. ఈ మేరకు పవన్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.

‘‘కోడి కత్తి కేసులో రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదన్నవారే.. ఇప్పుడు ఆ శాఖకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఆ కేసులో ఏమైనా పురోగతి ఉందో.. లేదో.. కూడా తెలియదు. పులివెందులలో వివేకానంద రెడ్డి హత్య కేసు వ్యవహారం గుండె పోటు నుంచి గొడ్డలి పోటు వరకు వెళ్లింది. ఇప్పటికీ విచారణ కొనసాగుతోంది. అసలు దోషులెవరో తేలలేదు. ఇవే కాదు.. సామర్లకోట మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన గిరీశ్‌బాబు అనే ఎస్సీ యువకుడిపై అధికార పార్టీ వేధింపులకు దిగింది. అందుకు పోలీసులను వాడుకోవడంతో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖలో ఓ మంత్రి పోలీసు అధికారి కాలర్ పట్టుకొని దుర్భాషలాడినా పోలీసులు మౌనం వహించాల్సి వచ్చింది. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ జనసేన కార్యకర్తలపై కేసులు బనాయిస్తూ, రాజకీయంగా కక్ష సాధిస్తున్నారు. ఇవి కేవలం కొన్ని మాత్రమే.

ఈ రాష్ట్రంలో దాడి చేసినా, హత్యలు చేసినా, అత్యాచారాలు చేసినా ఏం జరగదు.. ఎవరేం చేయరనే ధైర్యం నేరస్థులకు కలిగింది. ఈ పాలకుల వైఖరే ఇందుకు కారణం. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణను వైకాపా పాలకుల నుంచి ఆశించలేం. వారికి చిత్తశుద్ధి ఉంటే హత్య చేశానని ఒప్పుకున్న ఎమ్మెల్సీపై ఈ పాటికి పార్టీ పరంగా, శాసనమండలి నుంచి భర్తరఫ్‌ చేసేవారు. పోలీసు అధికారులే బాధ్యత తీసుకొని రాజకీయ బాసుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా శాంతిభద్రతల పరిరక్షణలో స్వతంత్రంగా వ్యవహరించాలి. అప్పుడే ప్రజలకు పోలీసు వ్యవస్థపై, చట్టాలపై విశ్వాసం కలుగుతుంది’’ అని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని