Pawan Kalyan: వైద్యులు చికిత్స చేయాలా? అంబులెన్సులు సమకూర్చాలా?: పవన్‌ కల్యాణ్‌

తిరుపతి రుయా ఆస్పత్రిలో చోటు చేసుకున్న ఘటన అమానవీయమైనదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత అంబులెన్స్ సేవలు ఆపేయడంతో శ్రీనరసింహ తన బిడ్డ మృతదేహాన్ని తీసుకువెళ్ళడానికి పడిన కష్టం, వేదన దృశ్యాలు చూసినట్లు పేర్కొన్నారు....

Published : 27 Apr 2022 01:37 IST

అమరావతి: తిరుపతి రుయా ఆస్పత్రిలో చోటు చేసుకున్న ఘటన అమానవీయమైనదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రుయా దయనీయ ఘటనకు ప్రభుత్వమే కారణమన్నారు. ఉచిత అంబులెన్స్ సేవలు ఆపేయడంతో శ్రీనరసింహ తన బిడ్డ మృతదేహాన్ని తీసుకువెళ్ళడానికి పడిన కష్టం, వేదన దృశ్యాలు చూసినట్లు పేర్కొన్నారు. చనిపోయిన బిడ్డను భుజంపైన వేసుకొని 90 కి.మీ. బైక్ మీద వెళ్లిన ఆ ఘటన కలచి వేసిందన్నారు. బిడ్డను కోల్పోయిన శ్రీనరసింహ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనకు విధుల్లో ఉన్న ఆస్పత్రి సీఎస్‌ఆర్‌ఎమ్‌వో సరస్వతీదేవిని బాధ్యురాలిని చేస్తూ సస్పెండ్‌ చేయగా.. సూపరింటెండెంట్‌ భారతికి షోకాజ్‌ నోటీసు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారని పవన్‌ ధ్వజమెత్తారు.

‘‘విధుల్లో ఉండే వైద్యులు చికిత్స చేయాలా? లేదా అంబులెన్సులు సమకూర్చాలా?ఆస్పత్రి పరిపాలనా విభాగం పటిష్టం చేయకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయి. ఈ ఒక్క ఘటనే కాదు.. రుయా ఆస్పత్రిలోనే కరోనా సమయంలో ఆక్సిజన్ లేకపోవడంతో 30 మంది మృత్యువాత పడ్డారు. కడప రిమ్స్‌లో విద్యుత్ కోతలతో పిల్లలు మృతి చెందారు. వరుసగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యపరమైన మౌలిక సదుపాయాల కొరత గురించే నర్సీపట్నంలో ప్రభుత్వ వైద్యుడు డా. సుధాకర్ బలంగా మాట్లాడితే వేధించారు. ఆ వేదనతోనే ఆయన చనిపోయారు. ఈ ఘటనలు ప్రభుత్వ వైఫల్యాన్ని చూపిస్తున్నాయి. ప్రభుత్వం వైద్య రంగం మీద ఏపాటి శ్రద్ధ చూపిస్తుందో అర్థమవుతోంది. కన్నవారి కడుపు కోత అర్థం చేసుకోలేని స్థితికి ఆస్పత్రుల చుట్టూ రకరకాల మాఫియాలు తయారయ్యాయి. వాటిపైనా, వారిని పెంచి పోషిస్తోన్న వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని