Pawan Kalyan: మున్ముందు దేశమంతా జనసేన భావజాలమే: పవన్‌ కల్యాణ్‌

కుల సమీకరణాల గురించి ఆలోచిస్తే ఎప్పటికీ అభివృద్ధి సాధ్యం కాదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. వారాహి యాత్రలో భాగంగా మచిలీపట్నంలో పవన్‌ పర్యటించారు.

Updated : 02 Oct 2023 19:25 IST

మచిలీపట్నం: కుల సమీకరణాల గురించి ఆలోచిస్తే ఎప్పటికీ అభివృద్ధి సాధ్యం కాదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. వారాహి యాత్రలో భాగంగా మచిలీపట్నంలో పవన్‌ పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. మచిలీపట్నానికి చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యం ఉందని.. తనను ఎంతగానో ప్రభావితం చేసిన నేల ఇదని చెప్పారు.

‘‘పింగళి వెంకయ్య, రఘుపతి వెంకటరత్నం నాయుడు పుట్టిన నేల ఇది. దుబాయ్‌ వంటి చోట్ల మూడింట రెండొంతులు భారతీయులే ఉంటారు. కులాల ఐక్యత గురించి నేను పదే పదే చెబుతాను. ఏ ఒక్క కులం వల్లో అధికారం రాదని గుర్తించాలి. నేను అన్నింటినీ సమదృష్టితో చూసే వ్యక్తిని. నేను కులాలను వెదుక్కొని స్నేహాలు చేయను. వైకాపా కీలక పదవులన్నీ ఒక వర్గంతో నింపేస్తే అభివృద్ధి ఎలా సాధ్యం? కాపులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు.. కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి. ఒక కులానికి మరో కులం పట్ల ఎందుకు ద్వేషం ఉండాలి?

సామాజిక వెనుకబాటును ఎలా రూపుమాపాలా అని అందరూ ఆలోచించాలి. నాలుగు ఎన్నికల్లో కష్టపడితే బీఎస్పీ అధికారంలోకి వచ్చింది. లేచిందే లేడికి పరుగు అన్నట్లు.. పార్టీ పెట్టగానే అధికారం రాదు. పార్టీ పెట్టగానే అధికారం అందుకోవడం ఒక్క ఎన్టీఆర్‌కే సాధ్యమైంది. జనసేన విశాలభావం ఉన్న పార్టీ.. ఇది ప్రాంతీయ పార్టీ కాదు. మున్ముందు జనసేన భావజాలమే దేశమంతా వ్యాపిస్తుంది. రాజధానికి 30 వేల ఎకరాలు అన్నప్పుడు ఆరోజు విభేదించా. రాజధాని అనేది రాత్రికి రాత్రే అభివృద్ధి కాదు. జగన్‌ను చిన్నప్పటి నుంచీ చూస్తున్నా. రాష్ట్రానికి జగన్‌ సరైన వ్యక్తి కాదని ఆనాడే అనుకున్నా. లోతైన దృష్టితోనే రాజకీయాలను చూడాలి’’ అని పవన్‌ అన్నారు.

ముందు గెలవాలి.. అప్పుడు మాట్లాడుదాం..

‘‘మనలో మనం గొడవలు పెట్టుకోకుండా ఉంటే.. మనం గెలుస్తాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా మాటల ద్వారానే సమస్యలకు పరిష్కారం వెతుకుదాం. తెదేపా-జనసేన కలయిక ద్వారా భవిష్యత్తులో నేను సీఎం అవుతానా.. లేదా.. అనేది మన మెజారిటీపై ఆధారపడి ఉంటుంది. నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న పార్టీని కూడా జనసేన నాయకులు, కార్యకర్తలు తక్కువ అంచనా వేయొద్దు. తెదేపా నేతలు ఇవాళ ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నారు కదా అని వారిని తక్కువ చేసి మాట్లాడొద్దు. ఎవరి ఓటు షేరు వారికి ఉంటుంది. చంద్రబాబు.. జగన్‌తో నాకు ఎలాంటి వ్యక్తిగత గొడవలు లేవు. తెదేపా - జనసేన గెలుపు మీ చేతుల్లోనే ఉంది. అధికారం సాధించే దశలో జనసేన బలమైన స్థానంలో ఉండాలనేది నా ఆకాంక్ష. అది మీ చేతుల్లోనే ఉంది. ముందు గెలవాలి. అప్పుడు మాట్లాడుదాం. ఎవరు రాజు.. ఎవరు మంత్రి అనేది..’’ అని పవన్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు