Pawan kalyan: మన హక్కులను కాలరాసే ఎవరినైనా ఎదుర్కోవాల్సిందే: పవన్‌ కల్యాణ్‌

‘దాదాపు 22 శాతం జనాభా ఉన్నా.. ఇంకా నిధులు ఇవ్వాలని కోరాలా? దేహి అంటే కుదరదు.. పోరాటం చేసే తీసుకోవాలి’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

Updated : 25 Jan 2023 19:15 IST

మంగళగిరి: వ్యక్తి ఆరాధన ఎంత మంచిదో.. అంతే ప్రమాదకరమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘వివక్షకు గురయ్యే కులాలను మనం అర్థం చేసుకోవాలి. ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో వివక్షకు గురవుతారు. వివక్షకు గురైనప్పుడే దాని గురించి తెలుస్తుంది. సమాజాన్ని కొన్ని కోణాల్లోనే కాదు.. సమగ్రంగా చూడాలి. మన కష్టం, శ్రమకు తగ్గ ఫలితం ఉండాలి. జనాభాకు తగ్గట్టు బడ్జెట్‌ కేటాయింపులు జరగాలి. దాదాపు 22 శాతం జనాభా ఉన్నా.. ఇంకా నిధులు ఇవ్వాలని కోరాలా? దేహి అంటే కుదరదు.. పోరాటం చేసే తీసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ సంపూర్ణంగా అమలు జరగాలి.

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు దారిమళ్లించకూడదు. బయటి శత్రువుల కన్నా మనతోటి ఉండే శత్రువులను కనిపెట్టాలి. మన హక్కులను కాలరాసే ఎవరినైనా ఎదుర్కోవాల్సిందే. సామాజిక పునర్నిర్మాణం చేయాలన్నదే నా తపన. నమ్మిన సిద్ధాంతానికి నిలబడి ఉండేవాడే నాయకుడు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన 27 పథకాలు తీసేశారని చెబుతుంటే చాలా బాధేసింది. ఈ మూడేళ్లలో రూ.20వేల కోట్లు రాకుండా చేశారంటే ఏమనాలి? ఎన్ని గొప్ప చట్టాలు, సంస్కరణలు తెచ్చినా ఆచరణలో పెట్టాలి కదా? ఆచరణలో పెట్టకపోతే చట్టాలు తెచ్చినా ప్రయోజనం ఉండదు. ఏపీ ప్రభుత్వం పబ్లిసిటీ కోసం రూ.15వేల కోట్లు ఖర్చు చేసింది. ఎస్సీ, ఎస్టీ నిధులు వారికి రాకుండా దారి మళ్లించి మోసం చేస్తారా?’’ అని పవన్‌ కల్యాణ్ ధ్వజమెత్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని