Pawan kalyan: గుంతలు పూడ్చలేరు.. రోడ్లు వేయలేరుగానీ.. విస్తరణ కావాలా?: పవన్‌ కల్యాణ్‌

మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం అనే చిన్న గ్రామంలో తెదేపా, జనసేన సానుభూతిపరులు, కార్యకర్తలకు చెందిన 53 ఇళ్లు, ప్రహరీలు కూల్చివేసిన విషయం తెలిసిందే.

Updated : 05 Nov 2022 14:08 IST

ఉద్రిక్తతల నడుమ పవన్‌ కల్యాణ్‌ ఇప్పటం పర్యటన

మంగళగిరి: మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం అనే చిన్న గ్రామంలో తెదేపా, జనసేన సానుభూతిపరులు, కార్యకర్తలకు చెందిన 53 ఇళ్లు, ప్రహరీలు కూల్చివేసిన విషయం తెలిసిందే. జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చామనే కక్షతోనే ఇళ్లను కూల్చారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో ఇప్పటంలోని బాధితులను పరామర్శించి వారికి సంఘీభావం తెలిపేందుకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుంచి ఇప్పటం బయలుదేరారు. పవన్‌ పర్యటన దృష్ట్యా అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు పవన్‌ వెళ్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో ఆయన కారు దిగి కొద్ది దూరం కాలినడకన వెళ్లారు. కొద్ది దూరం వెళ్లాక తన వాహనంలో ఇప్పటం గ్రామానికి చేరుకున్నారు. పవన్‌కల్యాణ్‌ను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇప్పటం చేరుకున్న జనసేనాని.. అక్కడ కూల్చివేసిన నివాసాలను పరిశీలిస్తున్నారు. పవన్‌ పర్యటన దృష్ట్యా ఇప్పటం గ్రామాన్ని పోలీసులు తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ ప్రభుత్వానికి బుద్ధి ఉందా.. మేమేమన్నా గూండాలమా?

ఇప్పటం చేరుకున్న పవన్‌ కల్యాణ్‌కు జనసైనికులు భారీ ఎత్తున స్వాగతం పలికారు. అక్కడ కూల్చేసిన ఇళ్లను పరిశీలించిన జనసేనాని.. బాధితులను పరామర్శించి సంఘీభావం తెలిపారు. అక్కడే కొంత మంది బాధితులతో మాట్లాడారు. కూల్చివేతల విషయంలో చోటుచేసుకున్న పరిణామాలపై బాధితులు పవన్‌కు వివరించారు. అనంతరం పవన్‌ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటం ఒక చిన్న గ్రామం. కాకినాడ లేదా రాజమహేంద్రవరమా రోడ్లు వెడల్పు చేయడానికి? ఎమ్మెల్యే ఆర్కే ఇల్లు ఉన్న పెదకాకానిలో రహదారి విస్తరణ ఎందుకు చేయడం లేదు. బాధితులతో కనీసం మాట్లాడకుండా ఆపడానికి మీరెవరు?మా సభకు ఇప్పటం గ్రామస్థులు స్థలం ఇచ్చారనే కుట్ర చేసి వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వైకాపా నేతలకు ఇదే చెబుతున్నా.. ఇడుపులపాయలో మేము హైవే వేస్తాం.

గుంతలు పూడ్చలేరు.. రోడ్లు వేయలేరుగానీ.. విస్తరణ కావాలా? ఈ ప్రభుత్వానికి బుద్ధి ఉందా.. మేము ఏమన్నా గూండాలమా? అత్యాచారాలు చేస్తున్న వారిని పోలీసులు వదిలేస్తున్నారు. కూల్చివేస్తున్న వారికి పోలీసులు కొమ్ముకాస్తున్నారు. అయినప్పటికీ పోలీసులు కూడా మా సోదరులే.. వారి కష్టాలు మాకు తెలుసు. పోలీసులు అడ్డుకున్నా జనసైనికులు మౌనంగా ముందుకెళ్లాలి. పోలీసులను ఏమీ అనొద్దు.. చేతులు కట్టుకొని ముందుకు నడవండి. ప్రజాస్వామ్య పరిరక్షణకు చేసే పోరాటంలో వెనక్కి తగ్గేది లేదు. అరెస్టులకు భయపడేది లేదు.. దేనికైనా సిద్ధమే. వైకాపా వాళ్లకు చెబుతున్నా.. మా మట్టిని కూల్చారు. మీ కూల్చివేత తథ్యం’’ అని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

నలుగురు కిరాయి మూకలు ఉంటే భయపడతామా?

‘‘ఇప్పటంలో ఇళ్లు కూల్చేస్తున్నారని తెలియగానే నేను తీసుకోలేకపోయాను. ఎవరు ఎదురు మాట్లాడినా వారిపై దౌర్జన్యం చేస్తున్నారు. రేషన్‌ కార్డులు రద్దు చేస్తున్నారు. ఎంత కాలం ఈ అన్యాయం. చూస్తూ ఊరుకునేది లేదు. నలుగురు కిరాయి మూకలు ఉంటే భయపడతామా? అలాంటివారు ఎంత మంది ఉన్నా బెదిరేది లేదు. ఎంతమాత్రం వెనకడుగు వేసేది లేదు. ఎంత మంది ఎన్ని రెక్కీలు నిర్వహించినా ఏం జరగదు. ఎక్కడ ఎవరికి ఏం జరిగినా పూర్తి బాధ్యత సజ్జల రామకృష్ణారెడ్డిదే. ఆయనే పూర్తి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది’’ అని పవన్‌ కల్యాణ్‌ తేల్చి చెప్పారు.


 



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని