Vishakapatnam: 28మంది జనసేన నేతలపై కేసు నమోదు.. విశాఖలో టెన్షన్‌.. టెన్షన్‌

విశాఖలో నిన్న సాయంత్రం నుంచి ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. ఎయిర్‌పోర్టు సమీపంలో జరిగిన ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 28 మంది జనసేన నేతలపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. 

Updated : 16 Oct 2022 19:02 IST

విశాఖపట్నం: విశాఖలో నిన్న సాయంత్రం నుంచి ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. ఎయిర్‌పోర్టులో మంత్రుల కాన్వాయ్‌పై దాడి ఘటన తర్వాత పవన్‌ ర్యాలీగా రావడం.. ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన రావడంతో పోలీసులు ర్యాలీని నియంత్రించలేకపోయారు. దీంతో ఆయన్ను కట్టడి చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నగరంలో ఎక్కడా ర్యాలీ నిర్వహించకూడదని, ప్రజలు అభివాదం చేస్తూ వెళ్లొద్దని, పోలీసు 30యాక్టు నిబంధనలు పాటించాలని ఆంక్షలు విధించారు. దీంతో పవన్‌ రాత్రి నుంచి హోటల్‌నే ఉండిపోయారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ బస చేసిన సాగరతీరంలోని నోవాటెల్‌ హోటల్‌ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నోవాటెల్‌ హోటల్‌లోని ఆరో అంతస్తులో పవన్‌ బస చేశారు. హోటల్‌ గది నుంచి చూస్తే విశాఖ సాగర అందాలు కనిపిస్తాయి. హోటల్‌ గదిలో ఉన్న వారు సైతం బయట ప్రజలకు కనిపిస్తారు. దీంతో పవన్‌ చూసేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆ ప్రాంతానికి భారీగా తరలివచ్చారు. అభిమానులు తనకోసం వేచి ఉన్న దృశ్యాలను పవన్‌ తన ట్విటర్‌లో పోస్టు చేశారు. మరోవైపు, జనసేన కార్యకర్తలు నోవాటెల్‌ వైపు రాకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.  నోవాటెల్‌ వద్ద భద్రతను విశాఖ పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ , క్రైమ్ డీసీపీ నాగన్న పరిశీలించారు. హోటల్ సమీపంలో ఉన్న వాహనాలు సీజ్ చేసి.. వంద మీటర్లు పరిధిలో వ్యక్తుల సంచారం లేకుండా పోలీసు చర్యలు చేపట్టారు. ఏసీపీ హర్షిత చంద్ర నేతృత్వంలో నోవాటెల్‌ వద్ద పోలీస్‌ పహారా కొనసాగుతోంది.

28మంది జనసేన నేతలపై కేసు నమోదు..

నిన్న సాయంత్రం ఎయిర్‌పోర్టు సమీపంలో మంత్రి రోజాపై కొందరు వ్యక్తులు దాడికి ప్రయత్నించారని ఆమె సహాయకుడు దిలీప్‌ కుమార్‌ ఫిర్యాదు మేరకు విశాఖ విమానాశ్రయ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. లోహపు మూత తగిలి తన తలకు గాయమైందని ఫిర్యాదులో పేర్కొన్నారు. 300 మంది జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రభుత్వ వాహనాలను, ఆస్తులను ధ్వంసం చేశారని విమానాశ్రయంలో విధులు నిర్వహిస్తున్న పెందుర్తి సీఐ నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు పలువురిపై వివిధ సెక్షన్ల కింద మరో కేసు నమోదు చేశారు. ఈ రెండు ఫిర్యాదులకు సంబంధించి  28 మంది జనసేన నేతలపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.  ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే జనసేన నాయకులు కోన తాతారావు, శివప్రసాద్‌రెడ్డిలను అరెస్టు చేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత నోవాటెల్‌ హోటల్‌లో బస చేసిన సుందరపు విజయ్‌కుమార్‌, పీవీఎస్‌ఎన్‌ రాజులను అరెస్టు చేసిన పోలీసులు.. పవన్‌ బస చేసిన ఫ్లోర్‌లోనూ తనిఖీలు చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని