Pawan Kalyan: అసెంబ్లీ గేటు కూడా తాకలేవంటే.. పిఠాపురం ప్రజలు డిప్యూటీ సీఎంను చేశారు: పవన్‌

గేటు తాకడం కాదు దాన్ని బద్దలుగొట్టుకుని పవన్‌ కల్యాణ్‌ అసెంబ్లీలో అడుగుపెడతారని తెదేపా నేత వర్మ అన్న మాటలు నిజమయ్యాయని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

Updated : 03 Jul 2024 20:05 IST

పిఠాపురం: గేటు తాకడం కాదు దాన్ని బద్దలుగొట్టుకుని పవన్‌ కల్యాణ్‌ అసెంబ్లీలో అడుగుపెడతారని తెదేపా నేత వర్మ అన్న మాటలు నిజమయ్యాయని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. బుధవారం సాయంత్రం పిఠాపురంలో నిర్వహించిన వారాహి సభలో ఆయన మాట్లాడారు. ‘‘పిఠాపురం ప్రజలు ఇచ్చిన బలం దేశ రాజకీయాల్లో మాట్లాడుకునేలా చేసింది. ఒక్కడి కోసం ఇంతటి ఘన విజయం అందించారు. అందుకు రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నా. డొక్కా సీతమ్మ స్ఫూర్తితో కష్టంలో ఉన్న మనిషికి అండగా నిలవాలనుకున్నా. మీరు డిప్యూటీ సీఎం దాకా తీసుకొచ్చారు. 100 శాతం స్ట్రయిక్‌ రేటు దేశంలో ఇప్పటివరకు ఎవరూ చూడలేదు. 

పిఠాపురం ప్రజలకు ఇదే నా హామీ...

పవన్‌ కల్యాణ్‌ను అసెంబ్లీ గేటు కూడా తాక నీయమన్నారు. దాన్ని పిఠాపురం ప్రజలు సీరియస్‌గా తీసుకున్నారు. గేటు తాకడం ఏంటి బద్దలుగొట్టుకుని వస్తారని వర్మ చెప్పారు. ఆ మాటలు నిజమయ్యాయి. చాలా మంది నన్ను హోంశాఖ తీసుకోమని చెప్పారు. కానీ, బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసమే నేను పంచాయతీరాజ్‌ శాఖ తీసుకున్నా. నాకు ఎలాంటి లంచాలు అవసరం లేదు. నిధులు సద్వినియోగం కావాలని అధికారులకు చెప్పా. వచ్చిన ఆదాయంతో ట్యాక్స్‌ కట్టాను. ఇప్పుడు మీ డబ్బు కాబట్టే ప్రతి రూపాయికి అధికారులను లెక్కలు అడుగుతున్నా. బాధ్యతగా ఉండాలనే మా శాఖలో ఖర్చులు తగ్గించుకుంటున్నాం.

లంచాలు తీసుకోను, మీ అభ్యున్నతికి పాటుపడతా, అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తానని మీ ముందు ప్రమాణం చేస్తున్నా. గతంలో వైకాపా నాయకులు పవన్‌ కల్యాణ్‌ పిఠాపురంలో ఉండడు.. హైదరాబాద్‌లో ఉంటాడని ప్రచారం చేశారు. అందుకే పిఠాపురంలో మూడు ఎకరాలు కొన్నా. ఈరోజే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయింది. ఉద్యోగాలు లేవని, నీళ్లు రాలేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగి కుమారుడిని కాబట్టి నాకు వారికి ఎలాంటి గౌరవం ఇవ్వాలో నాకు తెలుసు. ఈ విషయాన్ని పార్టీ నాయకులు కూడా అర్థం చేసుకోవాలి. అధికారులను గౌరవిస్తూనే పనులు చేయించుకోవాలి.

ఎన్టీఆర్‌ పార్టీ పెట్టినప్పుడు కూడా ఇంత మెజార్టీ రాలేదు.. 

తాగు, సాగునీరు, విద్య, వైద్యం, రోడ్లు ఉపాధి అవకాశాలు వంటి  హామీలన్నీ గుర్తున్నాయి. నా కుమార్తె కనిపించడం లేదని ఓ తల్లి వచ్చి తన బాధ చెప్పుకొంది. ఆమె కష్టం తీర్చాలని 9 రోజులు తాపత్రయపడ్డా. 9 నెలల క్రితం కేసు చిక్కుముడిని పోలీసులు త్వరగా ఛేదించారు. అదే వైకాపా ప్రభుత్వం 30 వేల మందికి పైగా ఆడబిడ్డలు కనిపించకుండా పోతే పట్టించుకోలేదు. వ్యవస్థల్లో తప్పు లేదని ఈ ఘటనలతో నిరూపితమైంది. వ్యవస్థలను సరిదిద్దుకోవాలని అధికారులు కూడా చెబుతున్నారు. 

ఓటర్లు రక్తం చిందించకుండా ఈ ఎన్నికల్లో  ప్రజాస్వామ్య విప్లవం తీసుకొచ్చారు. 151 స్థానాలున్న పార్టీని 11 స్థానాలకు పడగొట్టారు. బస్సులు, రైళ్లు, విమానాల్లో వచ్చి ఓటేసి వెళ్లారు. ఎన్టీఆర్‌ పార్టీ పెట్టిన సమయంలో కూడా ఎవరికీ ఇంత మెజారిటీ రాలేదని ఇటీవల స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు అన్నారు. కూటమి నేతలు పింఛను పంచలేరని వైకాపా అంటే తొలి రోజే ఆ పని చేసి చూపించాం. ఒక్క వాలంటీరు సాయం లేకుండానే ప్రభుత్వ యంత్రాంగం పనిచేసింది. చంద్రబాబు అపార అనుభవం అందుకు తోడ్పడింది. పంచాయతీరాజ్‌ గురించి ఎన్నో ఫైల్స్‌ చదువుతున్నాను. వైకాపా హయాంలో అడ్డగోలుగా నిధులు దారి మళ్లించారు. రుషికొండకు చేసిన రూ.600 కోట్ల ఖర్చులో కొంచెమైనా కేటాయించి ఉంటే రోడ్లు బాగుపడేవి. ఉద్యోగులకు జీతాలు అందేవి. 

పదవి ఉన్నా లేకున్నా నాలో ఎలాంటి మార్పు ఉండదు..

ప్రధానమంత్రిని కలిసినప్పుడు ఏం చెప్పాలని ఎంపీ ఉదయ్‌ అడిగారు. ఆయనకు మనం బలం అవ్వాలి కానీ, బరువు కాకూడదని చెప్పాను. ఉప్పాడ తీరం కోత సమస్యకు పరిష్కారం చూపిస్తూ టూరిజం అభివృద్ధి చేస్తాం. అందమైన కోస్టల్‌ రోడ్డును నిర్మిస్తాం. పిఠాపురంలో సెరీకల్చర్‌ను అభివృద్ధి చేస్తాం. గొల్లప్రోలులో ఉద్యానపంటల కోసం శీతల గిడ్డంగి నిర్మిస్తాం. కోటగుమ్మం గేట్‌ వద్ద రైల్వే పైవంతెన కావాలని కేంద్రాన్ని కోరాం. ఏ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా దిల్లీలో మంత్రులు సానుకూలంగా స్పందిస్తున్నారు. 

ఆర్థికంగా లోటు ఉన్న రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని నేను, చంద్రబాబు ఆలోచిస్తున్నాం. అంతా సీఎం.. సీఎం అంటున్నారు. అమ్మవారు నన్ను డిప్యూటీ సీఎంని చేశారు. పిఠాపురం ప్రజల విజ్ఞప్తులను తీసుకోవడానికి ప్రత్యేకంగా సిబ్బందిని నియమించా. ఏ వినతులైనా వారు స్వీకరిస్తారు. ఉపాధి, వైద్యం, శాంతిభద్రతల సమస్యలను వెంటనే పరిష్కరిస్తారు. పిఠాపురంలోని శ్రీపాద వల్లభుడి సాక్షిగా మీకు రుణపడి ఉంటా. పదవి ఉన్నా లేకున్నా నాలో ఎలాంటి మార్పు ఉండదు. ఈ అయిదేళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం’’ అని పవన్‌ కల్యాణ్ వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని