Pawan kalyan: డిసెంబరులో ఎన్నికలు రావొచ్చు.. జులై నుంచి ఇక్కడే ఉంటా: పవన్‌

త్రిముఖ పోటీలో బలికావడానికి జనసేన పార్టీ సిద్ధంగా లేదని పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు.కచ్చితంగా జనసేన, తెదేపా, భాజపా పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు.

Updated : 12 May 2023 19:25 IST

మంగళగిరి: డిసెంబరులో ఎన్నికలు పెట్టే అవకాశముందని, జులై నుంచి ఇక్కడే ఉంటానని  జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన జనసేన మండల, డివిజన్‌ అధ్యక్షుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘సీఎం.. సీఎం అనే కేకలు వేస్తే ముఖ్యమంత్రి కాలేను. క్రేన్లతో గజమాలలు వేసే కన్నా.. ఓట్లు వేయాలి. ఓట్లు వేస్తేనే సీఎం అవుతామని గుర్తించాలి. ప్రజాశక్తిని ఓట్ల కింద మార్చుకోవాలంటే నా అంత బలంగా తిరగాలి. ఒక్కొక్కరు వంద  ఓట్లు వేయించగలిగే సత్తా ఉండాలి. ఏం చేసినా నిర్మాణాత్మకంగా చేయాలి. సీఎం అనే పదవి రావాలంటే సముచిత స్థానంలో గెలిపించాలి.  నేను మానవతా వాదిని.. దేశభక్తుడిని. ఏటా కార్యకర్తల ఆరోగ్యం కోసం రూ.కోటి ఖర్చు చేస్తున్నా. నేను సర్వస్వాన్ని వదిలి మీకోసం వచ్చా. 2014లో మద్దతిచ్చాం.. తప్పులు ఎండగట్టాం’’ అని పవన్‌ వివరించారు.

త్రిముఖ పోటీలో బలికావడానికి జనసేన సిద్ధంగా లేదు..

త్రిముఖ పోటీలో బలికావడానికి జనసేన పార్టీ సిద్ధంగా లేదని పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు.‘‘ఫ్యూడలిస్టిక్‌ సిద్ధాంతాలతో రాష్ట్రాన్ని వైకాపా నలిపేస్తోంది. వైకాపా ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి అని గుర్తు పెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌ను అధోగతి పాల్జేసింది, రాష్ట్రంలో గూండాయిజాన్ని పెంచి పోషించింది, రైతులు, నిరుద్యోగులను మోసం చేసింది వైకాపానే. ఇంత మోసం చేసిన ఆ పార్టీని ప్రత్యర్థిగా భావించాలా? తెదేపానా? హెలికాప్టర్‌ వెళ్తుంటే పచ్చని చెట్లు కొట్టేస్తారా? ప్రజల్లో పచ్చదనాన్ని చంపేస్తున్నారు. రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న వైకాపాను గద్దె దించేయాల్సిందే. 

అనుకూల ప్రతికూల పరిస్థితులను తట్టుకున్న వారే నాయకులు. తెదేపా నాయకులను సీఎం చేసేందుకు జనసేన లేదు. మనకు ఎంత బలం ఉందో బేరీజు వేసుకోవాలి. 134 స్థానాల్లో పోటీ చేస్తే.. కనీసం 40 గెలిచినా సీఎం అయ్యేవాళ్లం. రాజకీయాల్లో వ్యూహాలు మాత్రమే ఉంటాయి, భేషజాలు ఉండవు. వ్యూహాలు నాకు వదిలి బాధ్యతలు మీరు తీసుకోండి. జూన్‌ నుంచి కార్యాచరణ రూపొందించి ముందుకెళ్తాం. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా జనసేన, తెదేపా, భాజపా పొత్తు ఉంటుంది.  ఏం చేసినా చెప్పి చేస్తా.. మొదటి అడుగు వైకాపాను గద్దె దించడమే. పొత్తు కచ్చితమనేది ప్రకటించా.. ఇంకా ఆ స్థాయిలో చర్చలు జరగలేదు. విధివిధానాలు ఇంకా ప్రకటించలేదు. పొత్తుపై కొలిక్కి వచ్చాక ప్రజల మధ్య ఒప్పందం చేసుకుంటాం.

మేం ఏం చేస్తామో ప్రకటించి పొత్తు పెట్టుకుంటాం. నాయకులు కావాలంటే వ్యూహమే కావాలి. వ్యూహం నేను అమలు చేస్తా.. ప్రజల మధ్యలోకి తీసుకెళ్లాలి. నేను ఏ వ్యూహం వేసినా రాష్ట్ర హితం నాకు ముఖ్యం. అడ్డగోలుగా సంపాదించి మనల్ని బెదిరిస్తారా? ఇంకోసారి ఇలాంటి వ్యక్తి సీఎం అయితే ఏపీ కోలుకోలేదు. ఇప్పుడు కావాల్సింది ఎవరు సీఎం అనేది కాదు. ఇప్పుడున్న సీఎంను తీసేయడం మొదటి ఆలోచన. ఎవరు సీఎం అనేది ఆరోజు బలాబలాలను చూసి నిర్ణయించుకోవాలి. వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దింపడం ముఖ్యమైంది. పొత్తు ప్రభుత్వాన్ని గద్దెను ఎక్కించడం ముఖ్యం’’ అని పవన్‌ కల్యాణ్‌ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని