Sharad Pawar: రాజీనామా వెనక్కి.. నూతనోత్సాహంతో పనిచేస్తానన్న పవార్‌

నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీకి (NCP) అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన శరద్‌పవార్‌ (Sharad Pawar) వెనక్కి తగ్గారు. తాను అధ్యక్ష పదవిలో కొనసాగుతానని వెల్లడించారు.

Published : 05 May 2023 19:16 IST

ముంబయి: నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీకి (NCP) రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన శరద్‌పవార్‌.. ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గారు. రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించిన ఆయన.. నూతనోత్సాహంతో పార్టీ అధినేతగా కొనసాగుతానని అన్నారు. పవార్‌ రాజీనామాను పార్టీ నియమించిన కమిటీ తిరస్కరించిన కొన్ని గంటల్లోనే మీడియా ముందుకు వచ్చిన పవార్‌ ఈ ప్రకటన చేశారు.

‘నా సహచరులు, పార్టీ కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తా. వారు నాపై చూపించిన ప్రేమ, నమ్మకం, విశ్వాసం నన్నెంతో కట్టిపడేశాయి. వారందరి విజ్ఞప్తి, పార్టీ నియమించిన కమిటీ నిర్ణయాన్ని గౌరవిస్తూ.. నా రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నా’ అని శరద్‌ పవార్‌ పేర్కొన్నారు. అన్ని విషయాలను పునః పరిశీలించుకున్న తర్వాతే ఈ నిర్ణయం వెల్లడిస్తున్నానన్న ఆయన.. నూతనోత్సాహంతో పనిచేస్తానని అన్నారు. సంస్థలో ఏ పదవికైనా వారసత్వ ప్రణాళిక ఉండాలని అభిప్రాయపడిన పవార్‌.. పార్టీలో వ్యవస్థాగత మార్పులపై దృష్టి పెడతానని అన్నారు. నూతన బాధ్యతలను కొత్త నాయకత్వానికి అప్పజెబుతానని వెల్లడించారు. పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని శరద్‌ పవార్‌ వెల్లడించారు.

1999లో సోనియాతో విభేదించి ఎన్సీపీని స్థాపించిన శరద్‌ పవార్‌.. అప్పటి నుంచి ఆయనే అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రాజకీయంగా అనేక ఆటుపోట్లను ఎదుర్కొని నిలిచిన ఎన్సీపీ.. అధికారంలో, ప్రతిపక్షంలో కొనసాగింది. తన జీవిత చరిత్రపై మరాఠీలో రాసిన పుస్తక సవరణ ఎడిషన్‌ను ఆవిష్కరించేందుకు ఇటీవల ముంబయిలో ఏర్పాటు చేసిన సమావేశంలో పవార్‌ చేసిన ప్రకటన అందర్నీ ఆశ్చర్యపరిచింది. పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో కార్యక్రమానికి హాజరైనవారు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కొందరు నేతలు, కార్యకర్తలు విలపిస్తూ.. రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రాధేయపడ్డారు. మహారాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు జయంత్‌ పాటిల్‌, పార్టీ నేత జితేంద్ర అవధ్‌ వంటి నేతలు కూడా షాక్‌కు గురై ఏడ్చేశారు. ఇలా రెండు రోజులపాటు పార్టీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతోపాటు పార్టీ నియమించిన కమిటీ కూడా పవార్‌ రాజీనామాను తిరస్కరించడంతో ఎన్సీపీ అధినేత వెనక్కి తగ్గారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని