Revanth reddy: సమస్యలపై మునుగోడులో చర్చ జరగాలి.. వ్యక్తిగత దూషణలు వద్దు: రేవంత్‌

మునుగోడు ఉప ఎన్నికపై కాకుండా వ్యక్తిగత విమర్శలపై దృష్టి మళ్లుతుండడంతో ఆ నియోజక వర్గ ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి 

Updated : 14 Aug 2022 15:36 IST

హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నికపై కాకుండా వ్యక్తిగత విమర్శలపై దృష్టి మళ్లుతుండడంతో ఆ నియోజక వర్గ ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, నిత్యావసర ధరల పెరుగుదల వల్ల పేదలపై పడుతున్న భారం మీద చర్చ జరగాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్ ధరలు పెంచి పేదలపై భారం మోపారని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. తెరాస, భాజపా ప్రభుత్వాల వల్ల మోసపోయామని ప్రజలు భావిస్తున్నారని.. 22 కోట్ల మంది ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే మోదీ కేవలం ఏడు లక్షల మందికి ఉద్యోగాలిచ్చారని ఆరోపించారు.

 ప్రజల పక్షాన ప్రశ్నించాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉందని, భాజపా పాలనలో పేదలు, రైతులు, యువకులు మోసపోయారని రేవంత్‌ విమర్శించారు. మునుగోడులో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు (ఎస్‌ఎల్‌పీసీ, బ్రాహ్మణవెల్లి), పోడు భూముల సమస్యలు,  స్థానికంగా ఉన్న ఇతరత్రా సమస్యలను పరిష్కరించడం కోసం రూ.5వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించి భాజపా ఓట్లు అడగాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు కేసీఆర్‌ చెప్పిందే చెప్పి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా కేసీఆర్‌కు ఓటు అడిగే హక్కు లేదన్నారు. ప్రజల సమస్యలపై, ప్రభుత్వ విధానాలపై మునుగోడులో చర్చ జరగాల్సి ఉందని, వ్యక్తిగత దూషణలు అవసరం లేదని రేవంత్‌ చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని