Murthy Yadav: మెగా ఫుడ్‌ పార్క్‌ భూములు జవహర్‌రెడ్డి బినామీల పరం!: జనసేన నేత మూర్తి యాదవ్‌

విశాఖపట్నం కేంద్రంగా ఉత్తరాంధ్రలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి చేసిన భూ దందాలు, కబ్జాలు బయటపడుతూనే ఉన్నాయని జనసేన నాయకుడు పీతల మూర్తి యాదవ్‌ ఆరోపించారు.

Updated : 12 Jun 2024 08:08 IST

బాధ్యులైన అధికారులందరినీ సస్పెండ్‌ చేయాలి

మాట్లాడుతున్న మూర్తి యాదవ్‌

విశాఖపట్నం (సీతంపేట), న్యూస్‌టుడే: విశాఖపట్నం కేంద్రంగా ఉత్తరాంధ్రలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి చేసిన భూ దందాలు, కబ్జాలు బయటపడుతూనే ఉన్నాయని జనసేన నాయకుడు పీతల మూర్తి యాదవ్‌ ఆరోపించారు. విశాఖ పౌరగ్రంథాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘గతంలో తెదేపా ప్రభుత్వం భోగాపురం మండలం బసవపాలెంలో మెగా ఫుడ్‌ పార్క్‌కు కేటాయించిన 70 ఎకరాల ఏపీఐఐసీ భూములకు తాజాగా జవహర్‌రెడ్డి ఫ్రీహోల్డ్‌ సర్టిఫికెట్లు జారీ చేయించి రిజిస్ట్రేషన్లకు సిద్ధం చేశారు. ఈ వ్యవహారం బయట పడడంతో రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు అప్రమత్తమై అందుకు నిరాకరించారు. దీంతో రూ.200 కోట్లకు పైగా విలువైన కుంభకోణం ఆగింది. ఇందులో ఏపీఐఐసీ సేకరించిన 50 ఎకరాల డీపట్టా భూములతో పాటు, మరో 20 ఎకరాల ప్రభుత్వ భూములకు కూడా ప్రైవేటు వ్యక్తులే యజమానులన్నట్లుగా నకిలీల పేరిట ఫ్రీహోల్డ్‌ పట్టాలను జవహర్‌రెడ్డి జారీ చేయించారు. 

 మెగా ఫుడ్‌ పార్క్‌కు బసవపాలెం సర్వే సంఖ్య 22, 23, 24, 79, 80, 81, 82, 83లలోని భూములను 2019 ఫిబ్రవరి 13వ తేదీన జి.ఒ.నంబరు 139 కింద కేటాయించారు. మూడేళ్లలో ఈ భూముల్లో ఫుడ్‌ పార్క్‌ ఏర్పాటు చేయాలని అప్పట్లో ఆదేశించారు. తర్వాత ప్రభుత్వం మారి.. తగిన ప్రోత్సాహం లేక పార్కు ఏర్పాటు కాలేదు. ఏ కారణం వల్లనైనా నిబంధనల మేరకు ఏర్పాటు చేయకుంటే సంబంధిత భూమిని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలి. అయితే తమ ఇబ్బందులను తెలియజేస్తూ సంబంధిత భూమిని పొందిన సంస్థ హైకోర్టు నుంచి స్టే  తెచ్చుకుంది. ఇదిలా ఉంటే భోగాపురం విమానాశ్రయం కేంద్రంగా వందల ఎకరాలు అప్పటికే 596వ జీవోను అడ్డం పెట్టుకొని దళితుల నుంచి బలవంతంగా లాక్కొని రిజిస్ట్రేషన్‌ చేయించుకొన్న జవహర్‌రెడ్డి ముఠా కన్ను ఈ భూమిపై పడింది. సంబంధిత భూములు పారిశ్రామికవేత్త చేతుల్లో కాకుండా ఇంకా రైతుల చేతుల్లోనే ఉన్నట్లు ఆ ముఠా చూపింది. జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్‌లపై ఒత్తిడి తీసుకువచ్చి ఆ భూములకు ఫ్రీహోల్డ్‌ ధ్రువపత్రాలు జారీ చేయించి సంబంధిత రైతులతో రిజిస్ట్రేషన్‌ చేయించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆ ప్రాంతంలో రైతుల నుంచి ఏపీఐఐసీ సేకరించిన 50 ఎకరాలతో పాటు పక్కనున్న మరో 20 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా అప్పట్లో ఫుడ్‌ పార్క్‌కు కేటాయించారు. ఈ ముఠా ఆ భూమి కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే ఉన్నట్లు తప్పుడు దస్త్రాలు సృష్టించి దానిని కూడా తమ ఖాతాలో వేసుకునేందుకు ఫ్రీహోల్డ్‌ సర్టిఫికెట్లు జారీ చేయించడం నిబంధనలకు పూర్తి విరుద్ధం. జవహర్‌రెడ్డితో పాటు సంబంధిత రెవెన్యూ అధికారులంతా ఇందులో అడ్డంగా దొరికినట్లే. వారందరిపై కేసులు నమోదు చేసి విచారణ జరిపించాలి. ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సిన ఉన్నతాధికారి భూ భక్షకుడిగా మారి తన బినామీల పేరిట పెద్ద కుంభకోణానికి పాల్పడడంపై కొత్త ప్రభుత్వం సమగ్రంగా విచారణ జరపాలి. పేదల భూములను ‘పెద్ద’ల పరం చేసేందుకు అవకాశం కల్పించిన జీవో 596ను తక్షణం రద్దు చేయాలి’ అని మూర్తియాదవ్‌ డిమాండ్‌ చేశారు. ఈ జీవో కింద రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాలు చేతులు మారినందున వాటిపైనా ప్రత్యేక బృందంతో విచారణ జరిపించాలని ఆయన కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని