Pema Khandu: అరుణాచల్‌ సీఎంగా మళ్లీ పెమా ఖండూ

అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పెమా ఖండూ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్ర భాజపా శాసనసభాపక్ష నేతగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Updated : 13 Jun 2024 06:36 IST

 నేడు ప్రమాణస్వీకారం 

ఈటానగర్‌: అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పెమా ఖండూ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్ర భాజపా శాసనసభాపక్ష నేతగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అరుణాచల్‌లో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇటీవలి ఎన్నికల్లో కమలదళం వాటిలో 46 సీట్లను గెల్చుకొని అధికారాన్ని నిలబెట్టుకుంది. ఈ నేపథ్యంలో శాసనసభాపక్ష నేతను ఎన్నుకునేందుకు పార్టీ ఎమ్మెల్యేలు ఈటానగర్‌లో బుధవారం భేటీ అయ్యారు. ఈ సమావేశానికి భాజపా కేంద్ర పరిశీలకులుగా సీనియర్‌ నాయకులు తరుణ్‌ చుగ్, రవిశంకర్‌ ప్రసాద్‌ హాజరయ్యారు. కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు కూడా అందులో పాల్గొన్నారు. శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన అనంతరం ఖండూ పలువురు ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ కె.టి.పర్నాయక్‌ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని కోరారు. ఆయన వినతిని గవర్నర్‌ మన్నించారు. సీఎంగా ఖండూ స్థానిక డోర్జీ ఖండూ కన్వెన్షన్‌ హాల్‌లో గురువారం ప్రమాణం చేయనున్నారు. ఈ వేడుకకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, భాజపా జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డా, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పలువురు ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని