Gujarat Election 2022: ఆప్‌ ప్రచారంలో మోదీ నినాదాలు.. కేజ్రీవాల్‌ రియాక్షన్‌ ఇదే!

భాజపాకు 27 ఏళ్లు అవకాశం ఇచ్చిన గుజరాత్‌ ప్రజలు, ఆప్‌కు ఐదేళ్లు అవకాశం ఇచ్చి చూడమని కేజ్రీవాల్ అభ్యర్థించారు. ఆదివారం గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయనకు అనుకోని పరిస్థితి ఎదురైంది. 

Published : 21 Nov 2022 02:34 IST

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో  ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఆప్‌ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం రోడ్‌షోలతో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. కానీ, ఆదివారం నిర్వహించిన రోడ్‌షోలో కేజ్రీవాల్‌కు అనుకోని పరిస్థితి ఎదురైంది. ప్రచారంలో కొందరు ప్రధాని మోదీకి అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో ప్రజాస్వామ్యంలో ఎవరికైనా మద్దతు తెలిపే హక్కు ప్రజలకు ఉందని, ఏదో ఒకరోజు మోదీ అనుకూల నినాదాలు చేస్తున్నవారి హృదయాలనూ గెలుస్తామని ఆయన అన్నారు. 

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పంచమహల్‌ జిల్లాలోని హలోల్‌లో కేజ్రీవాల్ రోడ్‌షో నిర్వహించారు. అక్కడ సభలో ఆయన మాట్లాడుతుండగా కొందరు వ్యక్తులు మోదీ.. మోదీ అంటూ నినాదాలు చేశారు.  ‘‘ మన స్నేహితులు కొంతమంది మోదీ.. మోదీ అంటూ అరుస్తున్నారు. వారికి నేను చెప్పేది ఒకటే. మీరు ఎవరికి అనుకూలంగానైనా నినాదాలు చేయండి. కానీ, ఇక్కడున్నది కేజ్రీవాల్‌. ఆయన మీ పిల్లలకు బడులు కట్టిస్తాడు, మీకు ఉచిత విద్యుత్‌ ఇస్తాడు. మాకు ఎవరితో శత్రుత్వంలేదు. ఏదో ఒకరోజు మోదీ నినాదాలు చేస్తున్న మీ మనసులు కూడా గెలిచి, మా పార్టీలో చేర్చుకుంటాం’’ అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. 

ఎన్నికల ప్రచారంలో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు రూ. 3,000 ఆర్థిక సాయం అందిచండంతోపాటు, రాష్ట్రంలో పాఠశాలల నిర్మాణం చేపడతామని కేజ్రీవాల్ తెలిపారు. ఆప్‌ మినహా ఏ పార్టీ కూడా పాఠశాలలు, ఆస్పత్రులు, ఉచిత విద్యుత్‌ గురించి మాట్లాడలేదని అన్నారు. భాజపాకు 27 ఏళ్లపాటు అవకాశం ఇచ్చారని, ఆప్‌ ఐదేళ్లు అవకాశం ఇచ్చి చూడమని ఓటర్లను అభ్యర్థించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 182 నియోజకవర్గాల్లో ఆప్‌ ఒంటరిగా పోటీ చేస్తోంది. డిసెంబరు 1, 5వ తేదీల్లో రెండు విడతల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. డిసెంబరు 8న ఫలితాలను వెల్లడించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని