Karnataka Results: సోనియాకు మాటిచ్చినట్టే..: ఉద్వేగానికి గురైన డీకే

Karnataka Results: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ అఖండ విజయం సాధించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేతలు మీడియాతో మాట్లాడారు. 

Updated : 13 May 2023 17:10 IST

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) ఫలితాల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖరారైంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర చీఫ్ డీకే శివకుమార్ (DK Shivakumar) ఉద్వేగానికి గురయ్యారు. కర్ణాటకలో పార్టీని గెలిపిస్తానని సోనియాగాంధీకి మాట ఇచ్చానని చెప్పారు. (Karnataka Results)

‘కర్ణాటకలో పార్టీని విజయతీరాలకు చేర్చుతానని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేకు మాట ఇచ్చాను. నేను జైల్లో ఉన్నప్పుడు సోనియా గాంధీ నన్ను కలవడానికి వచ్చారు. దానిని నేనెప్పటికీ మర్చిపోలేను’ అని డీకే ఉద్వేగానికి గురయ్యారు. అలాగే ముఖ్యమంత్రి పదవికి ప్రధాన అభ్యర్థి ఎవరని మీడియా ప్రశ్నించగా..‘కాంగ్రెస్ కార్యాలయమే మా దేవాలయం. అక్కడే మేం తదుపరి నిర్ణయం తీసుకుంటాం. ఈ సందర్భంగా సిద్ధరామయ్యతో సహా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని అన్నారు. 

డబ్బు, అధికారం పనిచేయలేదు: ఖర్గే

‘ప్రజలు స్వయంగా వచ్చి, మాకు మద్దతు తెలిపారు. అవినీతి పాలనకు వ్యతిరేకంగా వారు ఓటేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఇతర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి ఇక్కడ ప్రచారం నిర్వహించారు. అధికారం, డబ్బు ఉపయోగించారు. కానీ ప్రజలు మాత్రం కలిసికట్టుగా మాకే ఓటేశారు. ఇది సమష్టి విజయం’ అని మల్లికార్జున ఖర్గే( Mallikarjun Kharge) సంతోషం వ్యక్తం చేశారు.  

ఇది కాంగ్రెస్‌కు భారీ విజయం: సిద్ధూ

‘ఇది కాంగ్రెస్‌కు పెద్ద విజయం. భాజపా ప్రభుత్వంతో విసిగిపోయిన ప్రజలు మార్పు కోరుకున్నారు. 2018లో ఆపరేషన్ కమలంపై భాజపా భారీగా ఖర్చు చేసింది. ఇది భాజపా అగ్రనేతలు నరేంద్రమోదీ, అమిత్‌ షా, జేపీ నడ్డాకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు. మోదీ కర్ణాటకకు 20 సార్లు వచ్చారు. ఏ ప్రధాని ఈ తరహాలో ప్రచారానికి రాలేదు.  విద్వేష రాజకీయాలను ప్రజలు ఉపేక్షించరు. డబ్బుతో ఎన్నికల్లో గెలవాలన్న భాజపా కుట్ర ఫలించలేదు’ అని సిద్ధరామయ్య విమర్శించారు. అలాగే 2024లో రాహుల్ గాంధీ దేశ ప్రధాని అవుతారనే ఆశాభావం వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని