Kejriwal: జాతీయ పార్టీగా అవతరించాం.. థాంక్యూ గుజరాత్‌..!

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నిక(Gujarat Election2022)ల్లో సాధించిన ఓట్లతో ఆమ్‌ ఆద్మీ పార్టీ(AAP)కి జాతీయ పార్టీ హోదా దక్కిందని ఆ పార్టీ కన్వీనర్‌, దిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal) వెల్లడించారు.

Published : 08 Dec 2022 18:49 IST

దిల్లీ: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నిక(Gujarat Election2022)ల్లో సాధించిన ఓట్లతో ఆమ్‌ ఆద్మీ పార్టీ(AAP)కి జాతీయ పార్టీ హోదా దక్కిందని ఆ పార్టీ కన్వీనర్‌, దిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal) వెల్లడించారు. తమ పార్టీకి ఓట్లు వేసి గొప్ప అవకాశాన్ని కల్పించడంలో సహకరించిన గుజరాత్‌ ప్రజలు, ఆప్‌ కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. ఈ ఎన్నికల్లో గుజరాత్‌లో భాజపా కోటను ఢీకొట్టామన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తంచేశారు. గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో తాము ఎవరిపైనా బురదజల్లేందుకు ప్రయత్నించలేదని.. పంజాబ్‌, దిల్లీలలో ఆప్‌ ప్రభుత్వాలు అమలు చేస్తోన్న కార్యక్రమాలనే ఓటర్లకు వివరించామన్నారు. గుజరాత్‌ ఎన్నికల్లో 156 సీట్లతో భాజపా అపూర్వ విజయం సాధించగా.. కాంగ్రెస్‌ 16, ఆప్‌ 5, ఇతరులు నాలుగు చోట్ల గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌ వీడియో ప్రసంగం చేశారు. దేశంలో కేవలం కొన్ని పార్టీలకు మాత్రమే జాతీయ పార్టీగా అవకాశం లభిస్తుందని.. పదేళ్ల క్రితం చిన్న పార్టీగా ఉన్న ఆప్‌ ఇప్పుడు జాతీయ పార్టీ హోదాను దక్కించుకుందని హర్షం వ్యక్తంచేశారు. ప్రస్తుతం తమ పార్టీ దిల్లీ, పంజాబ్‌లలో ప్రభుత్వాలు నడుపుతోందన్నారు. ‘గుజరాత్‌లో ఆప్‌కు ఎక్కువ సీట్లు ఏమీ రాలేదు.. అక్కడ వచ్చిన ఓట్లు మా పార్టీ జాతీయ పార్టీ హోదాను సాధించడానికి దోహదపడ్డాయి. అందుకు గుజరాత్‌ ప్రజలకు కృతజ్ఞతలు. చాలా తక్కువ పార్టీలకే జాతీయ హోదా వస్తుంది. ఆ జాబితాలో ఇప్పుడు మేమూ చేరాం. మా పార్టీ వయస్సు కేవలం పదేళ్లే’ అని అన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని