Published : 14 Mar 2021 01:05 IST

ఐదు దశాబ్దాల చరిత్ర మారేనా..?

మళ్లీ పినరయి విజయన్‌దే గెలుపంటున్న విశ్లేషకులు

తిరువనంతపురం: కేరళలో ఐదేళ్లు అధికారంలో కొనసాగిన పార్టీ తరువాతి ఎన్నికల్లో ఓటమిపాలవ్వడం కొన్ని దశాబ్దాలుగా సంప్రదాయంగా వస్తోంది. తమిళనాడులో కూడా ఇదే ఆనవాయితీ ఉండేది. కానీ 2016 ఎన్నికల్లో రాజకీయ పండితుల అంచనాలను తారుమారు చేసి అన్నాడీఎంకే రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఈసారి కేరళలోనూ తమిళనాడు ఫలితాలు పునరావృతం కాబోతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వామపక్ష కూటమి ఎల్డీఎఫ్‌ రెండోసారి అధికారం నిలబెట్టుకుంటుందని అన్ని సర్వేలు అంచనా వేస్తున్నాయి. బంగారం స్మగ్లింగ్‌ కేసులో ఆరోపణలతో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్న పినరయి సర్కారుకు ఈ సర్వేల ఫలితాలు ఆత్మస్థైర్యాన్ని నింపాయి. 

తమిళనాట, కేరళలో ఒకే తరహాలో..
గత ఎన్నికల ముందువరకు తమిళనాట ఒక పార్టీ అధికారంలో ఉంటే మరో దఫా ఆ పార్టీ ప్రతిపక్ష స్థానానికే పరిమితమయ్యేది. కానీ గతసారి జరిగిన ఎన్నికల్లో డీఎంకేను రెండోసారి ఓడించి జయలలిత సారథ్యంలోని అన్నాడీఎంకే ఆ సంప్రదాయానికి తెరదింపింది. పొరుగున ఉన్న కేరళలోనూ అలాంటి సంప్రదాయమే కొనసాగుతోంది. ఐదు దశాబ్దాలుగా ఒకసారి ఎల్డీఎఫ్, మరోసారి యూడీఎఫ్ అధికార పగ్గాలు చేపట్టాయి. ఈసారి వరుసగా ఎల్డీఎఫ్‌ కూటమి అధికారం నిలబెట్టుకునే సూచనలు కనిపిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.అయితే 1970, 1977 ఎన్నికల్లో మాత్రం యూఎఫ్‌ వరుసగా రెండుసార్లు అధికారంలోని రావడం విశేషం. అనంతరం ఆ రికార్డును ఇప్పటివరకు ఏ ఫ్రంట్‌ అధిగమించలేదు.

అభివృద్ధి కార్యక్రమాలతో దూసుకుపోతూ..
కేరళ శాసనసభలో 140 స్థానాలు ఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 71 స్థానాలు కావాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం సీఎం పినరయి విజయన్‌ సారథ్యంలోని ఎల్డీఎఫ్ సులభంగానే మ్యాజిక్‌ ఫిగర్‌ సాధించే అవకాశం కనిపిస్తోంది. అసలుసిసలు కమ్యూనిస్టు అయిన పినరయి విజయన్‌ అదృష్టాన్ని నమ్ముకోకుండా.. అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల మనసును చూరగొంటున్నారు. అధికారం చేపట్టిన నాటినుంచే క్షేత్రస్థాయిలో కూటమి పటిష్టతకు పావులు కదిపారు. ఇటీవల సంచలనం రేపిన బంగారం స్మగ్లింగ్‌ కేసులో విజయన్‌పై ఆరోపణలు వచ్చాయి. కానీ ఆ తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లో ఆ ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. మెజార్టీ స్థానాలను ఎల్డీఎఫ్‌ కైవసం చేసుకొని ప్రత్యర్థులకు సవాలు విసిరింది. పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు, బంగారం స్మగ్లింగ్‌ ఆరోపణలు ఎల్‌డీఎఫ్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసినా సీఎం పినరయి మాత్రం అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల్లో అభిమానం చూరగొన్నారు.

భాజపా ఏ మేర ప్రభావం చూపుతుందో..!
కేరళలో పాగా వేయాలని భావిస్తున్న భాజపా.. 88 ఏళ్ల మెట్రోమ్యాన్‌ శ్రీధరన్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. శ్రీధరన్‌కు మంచి పేరు ఉన్నప్పటికీ భాజపాకు అధికారం లేదా గౌరవప్రదమైన స్థానాలు తేగలరా అనేది అనుమానంగా కనిపిస్తోంది. ఎన్డీఏకు కొన్నిచోట్ల దాదాపు 35 శాతం ఓట్లు పడినా ఎల్డీఎఫ్‌ కూటమి ముందు నిలిచి గెలవడం కష్టమే. ఈసారి యూడీఎఫ్‌ విజయావకాశాలు అంతంత మాత్రంగానే ఉండటంతో స్వింగ్‌ ఓట్లన్నీ ఎల్డీఎఫ్‌కు మళ్లి వారి గెలుపు అవకాశాలను మెరుగుపరుస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని