BJP: కేసీఆర్‌ నుంచి మేం అవినీతి నేర్చుకోవాలా? కుటుంబ పాలనా?: కేంద్రమంత్రులు ధ్వజం

తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రమంత్రులు పీయూష్‌ గోయల్‌, కిషన్‌ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని.....

Updated : 03 Jul 2022 16:26 IST

హైదరాబాద్‌: తెలంగాణలో సీఎం కేసీఆర్‌ ఎనిమిదేళ్ల పాలనపై కేంద్రమంత్రులు పీయూష్‌ గోయల్‌, కిషన్‌ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని పీయూష్‌ గోయల్‌ ఆరోపించారు. గత 8 ఏళ్లుగా కేంద్రం తెలంగాణకు ఎన్నో నిధులు ఇచ్చిందన్నారు. హెచ్‌ఐసీసీ వేదికగా భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండో రోజూ కొనసాగాయి. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రులు పీయుష్‌ గోయల్‌, కిషన్‌ రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో తెలంగాణపై ప్రకటనపై చర్చ సందర్భంగా స్థానిక నేత డీకే అరుణ ఇక్కడి పరిస్థితులను వివరించారని పీయూష్‌ తెలిపారు. ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగానూ రాష్ట్ర ప్రజలకు కష్టాలు ఎక్కువయ్యాయని ఆమె చెప్పారన్నారు.

‘‘తెలంగాణ కోసం ప్రజలు, యువత ప్రాణ త్యాగాలు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదాలపైనే తెలంగాణ ఏర్పడింది. కానీ, ఈ విషయాలను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మంత్రులు అధికారంలో ఉండి ప్రజలతో ఆడుకుంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత పెద్దఎత్తున నిధులు తెలంగాణకు వచ్చాయి. క్షేత్రస్థాయి వరకూ వీటిని అందించకుండా ప్రభుత్వం అక్రమాలు చేసింది. విద్య, వైద్యం తదితర అంశాల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. నీటి పారుదలకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులోనే పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేశారు. ₹1.50లక్షల కోట్లను వెచ్చించినా ప్రాజెక్టు పూర్తి కాలేదు. పాలమూరు రంగారెడ్డి, నెట్టెంపాడు, దిండి ప్రాజెక్టుల్లో ఏదీ పూర్తి చేయలేదు. తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ఆ పరిస్థితులు ఇప్పటికే కనిపిస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాజపా మంచి ఫలితాలు సాధించింది. దుబ్బాక నియోజకవర్గాన్ని భాజపా గెలుచుకుంది. తెలంగాణ ప్రజల ఆశల్ని, ఆపేక్షలను పూర్తి చేసే బాధ్యతను భాజపా తీసుకుంటుంది. తెలంగాణలోని కుటుంబ పాలనను అంతం చేసేందుకు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి నేతృత్వంలో స్థానిక భాజపా బృందం బాద్యత తీసుకుంటుంది’’ అని పీయూష్‌ గోయల్‌ తెలిపారు.

తెరాసది దిగజారుడు రాజకీయం: కిషన్‌ రెడ్డి

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలను అడ్డుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేస్తోందో గడిచిన రెండు రోజులుగా బయట కనబడుతోందని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. భాజపా సమావేశాల కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపైనా జరిమానాలు వేశారన్నారు. రాష్ట్రంలో తెరాస దిగజారుడు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. హెచ్‌ఐసీసీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తెలంగాణాలో అభివృద్ధిని చూసి నేర్చుకోండి అంటూ తెరాస నేతలు చెబుతున్నారు. కేసీఆర్ సర్కార్‌ నుంచి అవినీతిని నేర్చుకోవాలా? కుటుంబ పాలనను నేర్చుకోవాలో చెప్పాలి. తెరాస సర్కార్‌ స్టీరింగ్‌ అసదుద్దీన్‌ ఓవైసీ చేతిలో ఉంది. ప్రగతి భవన్‌లోకి మంత్రులకు ఎవరికీ ప్రవేశంలేదు. ఎంఐఎం నేత మాత్రం నేరుగా సీఎం వద్దకు వెళ్తారు. నెలలో 20 రోజులు సీఎం కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌లోనే ఉంటారు. సచివాలయానికి రాని సీఎం దేశంలో కేసీఆర్‌ ఒక్కరే. వాస్తు పేరుతో సచివాలయం కూలగొట్టి వందల కోట్లు వృథా చేశారు’’ అని ఆరోపించారు. 

‘‘గడిచిన 8 ఏళ్లుగా హోర్డింగ్‌లు, ప్రకటనల ప్రచార పాలనే నడుస్తోంది. తెరాస ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేస్తోంది.  ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఎలా మాట్లాడాలన్న దానిపైనే కేసీఆర్ సర్కార్‌ ఆలోచిస్తోంది. కుటుంబ పాలన పార్టీని విసిరేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అసలు తెలంగాణలో ప్రజాస్వామ్యమే లేదు. భాజపా తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారీ తప్ప కుటుంబ పార్టీకి కాదు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తెరాస తీవ్రస్థాయిలో అక్రమాలకు పాల్పడింది. డబ్బులు కుమ్మరించింది. ప్రతి ఇంటికీ రూ.10వేలు చొప్పున పంచింది. అయినా ప్రజలు భాజపాకే ఓటేసి గెలిపించారు. ఓటు బ్యాంకు రాజకీయాలపైనే తెరాస ఆధారపడింది. దీనికి వ్యతిరేకంగా భాజపా పోరాడుతుంది. కుటుంబ పాలన పోయి భాజపా అధికారంలోకి రావాలని తెలంగాణ ప్రజలు కూడా భావిస్తున్నారు. గత ఐదేళ్ల పాలనతో కేబినెట్‌లో మహిళను చేర్చుకోని కేసీఆర్‌.. మాకు రాజకీయం నేర్పిస్తారా? దేశంలోనే అధికంగా పెట్రోల్‌ ధరలు తెలంగాణలోనే ఉన్నాయి’’ అని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని