Published : 23 Jun 2022 16:27 IST

Revanth reddy: పేదల పక్షాన పోరాడే దళపతి దొరికింది: రేవంత్‌ రెడ్డి

 కాంగ్రెస్‌లో చేరిన పీజేఆర్‌ కుమార్తె 

హైదరాబాద్: దివంగత పి.జనార్దన్ రెడ్డి (పీజేఆర్) కుమార్తె, ఖైరతాబాద్‌ కార్పొరేటర్ విజయారెడ్డి గురువారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇటీవల తెరాస పార్టీకి రాజీనామా చేసిన ఆమె..  ఇవాళ పెద్దఎత్తున తన అనుచరులతో కలిసి గాంధీభవన్‌కు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా పీజేఆర్‌ సేవలను నేతలు కొనియాడారు. పీజేఆర్‌ పేరు తెలియని వారు ఉండరని, పేదలకు పెద్దన్న పీజేఆర్‌ అని రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని ఎన్నో బస్తీలు ఆయన కృషితోనే వెలిశాయని, ప్రజల కోసం సొంత పార్టీని కూడా నిలదీయడానికి పీజేఆర్ వెనుకాడలేదని వివరించారు. 

ఎక్కడ పోటీ చేసినా విజయారెడ్డి గెలుస్తుంది..
‘‘పీజేఆర్‌ లేని లోటు ప్రస్తుత తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తోంది. నగరంలో నేడు మహిళలకు, పేదలకు రక్షణ లేదు. ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం లేదు. బస్తీ ప్రజల పక్షాన పోరాడేందుకు నాయకత్వం అవసరం. అందుకోసమే విజయారెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. హైదరాబాద్ పేద ప్రజల పక్షాన పోరాడే దళపతి మాకు దొరికింది. విజయారెడ్డికి పార్టీలో మంచి గౌరవం దక్కుతుంది’’ అని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావడం సంతోషం. పీజేఆర్‌ కూతురుగా విజయారెడ్డికి మంచి భవిష్యత్ ఉంది. ఖైరతాబాద్ సహా ఎక్కడ పోటీ చేసినా ఆమె గెలుస్తుంది. కాంగ్రెస్‌ను గెలిపించుకుంటేనే పీజేఆర్‌కు నిజమైన నివాళి’’ అని పేర్కొన్నారు.

3రంగుల జెండా వదలను: విజయారెడ్డి
ఖైరతాబాద్‌ ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటానని కార్పొరేటర్‌ విజయారెడ్డి అన్నారు. పార్టీ మారడం ఒక్క రోజు తీసుకున్న నిర్ణయం కాదని, ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఘటనలు తీవ్రంగా బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. షీ టీమ్‌లు పెట్టామని గొప్పగా చెబుతున్నా.. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయన్నారు. ‘‘పెన్షన్, రేషన్ కార్డుల కోసం పేదలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రజల బాగోగులు పక్కన పెట్టారు. కాంగ్రెస్ మాత్రమే పేదలకు న్యాయం చేస్తుంది. అందువల్లే సోనియా, రాహుల్ నాయకత్వంలో పని చేయడానికి వచ్చాను. నేను పదవుల కోసం పార్టీ మారలేదు. ఇక 3 రంగుల జెండా వదలను. నాది ఇక ఒకటే జెండా..ఒకటే బాట’’ అని విజయారెడ్డి స్పష్టం చేశారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని