
భాజపా కీలక సమావేశానికి ప్రధాని మోదీ
దిల్లీ: పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ వంటి కీలక రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ భారతీయ జనతా పార్టీ ఆదివారం కీలక సమావేశం నిర్వహించింది. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. కొత్తగా నియమితులైన పార్టీ కేంద్ర కార్యవర్గ సభ్యులతో పాటు రాష్ట్రాల అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో దాదాపు ఏడాది తర్వాత జరిగిన ప్రత్యక్ష సమావేశం ఇదే కావడం గమనార్హం.
ఐదురాష్ట్రాల ఎన్నికలు ప్రధాన అజెండాగా ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు ప్రధాని మోద కరోనా కారణంగా మరణించిన వారికి నివాళులర్పించారు. అనంతరం పార్టీ నేతలనుద్దేశించి మాట్లాడారు. ఎన్నికలతో పాటు వ్యవసాయ చట్టాలు, ఆత్మనిర్భర్ భారత్ గురించి చర్చించినట్లు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అరుణ్‌సింగ్ మీడియాకు వెల్లడించారు. ఆయా రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించినట్లు తెలిపారు.ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ అధికార పీఠాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న భాజపా అందుకు అనుగుణంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దీంతో పాటు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. అసోంలో రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ఈ సమావేశం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.