‘ఇంకోసారి ఫకీర్‌ అని ప్రకటించకూడదు’..సంజయ్‌ రౌత్‌ కామెంట్స్‌!

ప్రధాని నరేంద్రమోదీపై శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ విమర్శలు గుప్పించారు. ఇకపై తనను తాను సన్యాసిని (ఫకీర్‌) అని మోదీ చెప్పుకోవద్దన్నారు.

Published : 03 Jan 2022 01:17 IST

ముంబయి: ప్రధాని నరేంద్రమోదీపై శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ విమర్శలు గుప్పించారు. ఇకపై తనను తాను సన్యాసిని (ఫకీర్‌) అని మోదీ చెప్పుకోవద్దన్నారు. తన కాన్వాయ్‌లో రూ.12 కోట్ల విలువైన కారును ఉపయోగిస్తూ అలా చెప్పుకోవడం తగదన్నారు. ఇదే సమయంలో మాజీ ప్రధానులు జవహర్‌ లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీని రౌత్‌ కొనియాడారు. ఈ మేరకు శివసేన అధికారిక పత్రిక ‘సామ్నా’లో ఆదివారం ఆయన ఓ వ్యాసం రాశారు.

ప్రధాని నరేంద్రమోదీ కాన్వాయ్‌లో కొత్తగా రూ.12 కోట్ల విలువైన కారును వినియోగిస్తున్నట్లు డిసెంబర్‌ 28న వచ్చిన వార్తలను ఉద్దేశించి రౌత్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘తనను తాను ఫకీర్‌ అని చెప్పుకునే వ్యక్తి.. అదీ విదేశాల్లో తయారైన కారును వాడుతున్నారు. ప్రధానిగా భద్రత, సౌకర్యాలు ముఖ్యమే అయినప్పటికీ ఇకపై తనను తాను ఫకీర్‌ అని మాత్రం మోదీ  చెప్పుకోవద్దు’’ అని సంజయ్‌ రౌత్‌ పేర్కొన్నారు. మేకిన్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా అని స్వదేశీ జపం చేస్తూ విదేశాల్లో తయారైన కారును వినియోగించడం ఏంటని ప్రశ్నించారు. దేశ తొలి ప్రధాని అయిన జవహర్‌ లాల్‌ నెహ్రూ దేశీయంగా తయారైన అంబాసిడర్‌ కారునే వినియోగించారని గుర్తుచేశారు. తన ప్రాణాలకు ముప్పుందని తెలిసినా సిక్కు భద్రతాధికారులను ఇందిరగాంధీ మార్చలేదని పేర్కొన్నారు.

ప్రధాని కారు గురించి ఇటీవల కాంగ్రెస్‌ సైతం ఇలాంటి విమర్శలే చేసింది. ‘‘దేశంలో ఇప్పుడు ప్రతివ్యక్తి నరేంద్ర మోదీలాంటి ఫకీర్‌ (సన్యాసి) బతుకు కోరుకొంటున్నాడు. గగనయానానికి రూ.8,000 కోట్ల విమానం, భూమ్మీద తిరిగేందుకు రూ.20 కోట్ల కారు, ఇల్లు కట్టేందుకు రూ.2,000 కోట్లు. ఫకీర్‌ బతుకంటే ఇదే కాబోలు’’ అంటూ ఏఐసీసీ అధికార ప్రతినిధి గౌరవ్‌ వల్లభ్‌ ఎద్దేవా చేశారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాన్వాయ్‌లో కొత్త కార్లను చేర్చడం పెద్ద విశేషం ఏమీ కాదని, ఇది సర్వసాధారణంగా జరిగేదే అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కొత్తగా కొన్న మెర్సిడెస్‌ మేబాక్‌ కార్ల ధర, ఇతర ప్రమాణాల గురించి మీడియాలో ప్రచారంలో ఉన్న అంశాల్లో ఊహాగానాలే ఎక్కువగా ఉన్నట్లు తెలిపాయి. మీడియా చెబుతున్న ధరల్లో (రూ.12 కోట్లు) ఆ కార్ల విలువ మూడోవంతు ఉండొచ్చని పేర్కొన్నాయి. వీవీఐపీల రక్షణకు వాడే వాహనాలను ఎస్పీజీ నియమాల ప్రకారం ప్రతి ఆరేళ్లకు ఓమారు మార్పు చేస్తామని అధికారవర్గాలు తెలిపాయి. మోదీ గత కాన్వాయ్‌లోని కార్లు ఏకబిగిన ఎనిమిదేళ్లు వినియోగించినట్లు వెల్లడించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని