Gujarat Election: గుజరాత్‌ ఎన్నికలు.. క్యూలైన్‌లో నిల్చుని ఓటేసిన ప్రధాని మోదీ

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌లో క్యూలైన్‌లో నిల్చుని ఆయన ఓటేశారు.

Updated : 05 Dec 2022 12:53 IST

గాంధీనగర్‌: గుజరాత్‌ (Gujarat) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) తుది విడత పోలింగ్‌ సోమవారం ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Modi) తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌లోని రాణిప్‌లో గల పోలింగ్‌ కేంద్రంలో ప్రధాని ఓటేశారు.

ప్రధాని మోదీ (Modi) ఈ ఉదయం గాంధీనగర్‌ రాజ్‌భవన్‌ నుంచి అహ్మదాబాద్‌ చేరుకున్నారు. రాణిప్‌లోని నిషాన్‌ పబ్లిక్‌ స్కూల్‌కు వచ్చిన మోదీ.. కాన్వాయ్‌ను కొంతదూరంలో ఆపి నడుచుకుంటూ పోలింగ్ కేంద్రం వరకు వెళ్లారు. ప్రధానిని చూసేందుకు వందల మంది అభిమానులు రాగా.. దారిపొడవునా వారికి అభివాదం చేశారు. అనంతరం పోలింగ్ కేంద్రం వద్ద సామాన్య ప్రజలతో కలిసి క్యూలైన్‌లో నిల్చుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతకుముందు.. ఈ ఎన్నికల్లో (Gujarat Polling) ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని మోదీ ట్విటర్‌ వేదికగా పిలుపునిచ్చారు.

ఓటేసిన ప్రముఖులు..

ఇక గుజరాత్‌ (Gujarat) ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ (Bhupendra Patel) అహ్మదాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. షీలాజ్‌ అనుపమ్‌ పాఠశాలలోని పోలింగ్ కేంద్రానికి వచ్చిన సీఎం పటేల్‌ కూడా క్యూలైన్‌లో నిల్చుని ఓటేశారు. దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా దంపతులు అహ్మదాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా అహ్మదాబాద్‌లోనే ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఓటు వేసేందుకు ప్రజలు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 9 గంటల వరకు 4.75శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

రెండో విడతలో భాగంగా 14 జిల్లాల్లోని 93 నియోజకవర్గాలకు నేడు పోలింగ్‌ కొనసాగుతోంది. మొత్తం 833 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2.51 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. 5.30 గంటలకు ఎగ్జిట్ పోల్‌ ఫలితాలు వెల్లడికానున్నాయి. డిసెంబరు 8వ తేదీన గుజరాత్‌తో సహా హిమాచల్‌ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు