అమిత్‌ షా, నడ్డాతో మోదీ కీలక భేటీ

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. కేంద్ర కేబినెట్‌ విస్తరణ జరిగే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో.....

Published : 12 Jun 2021 01:40 IST

దిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. కేంద్ర కేబినెట్‌ విస్తరణ జరిగే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఈ ముగ్గురు అగ్రనేతల భేటీ ప్రాధాన్యం సంతరించుకొంది. కరోనా సెకండ్‌ వేవ్‌తో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో పలు మంత్రిత్వ శాఖల పనితీరుపైనా సమీక్షిస్తున్నట్టు సమాచారం. ఆయా శాఖల పనితీరు ఆధారంగా మంత్రివర్గంలో భారీగా మార్పులు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. 2019లో అఖండ విజయంతో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్‌ విస్తరణ ప్రక్రియ జరగలేదు. 

మరోవైపు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన రెండు రోజుల దిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, అమిత్‌ షాలతో భేటీ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికలకు వెళ్లేముందు యూపీ రాష్ట్ర కేబినెట్ విస్తరణపైనా వార్తలు వస్తున్నాయి. అయితే, ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ పలువురు మంత్రులతో విడతల వారీగా భేటీ అయ్యారని, ఈ సమావేశంలో జేపీ నడ్డా కూడా పాల్గొన్నట్టు సమాచారం. యూపీలో మిత్రపక్షమైన అప్నా దళ్‌ నేత అనుప్రియా పాటిల్‌, తదితరులతో కేంద్ర హోంమంత్రి నిన్న చర్చలు జరిపారు. అలాగే, పలువురు కేంద్రమంత్రులతో గురువారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసంలో ఐదు గంటల పాటు సమావేశం నిర్వహించినట్టు సమాచారం. ఈ చర్చలకు సంబంధించి భాజపా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని