PM Modi: కుటుంబ పాలనలో తెలంగాణ బందీ: ప్రధాని మోదీ

పట్టుదలకు, పౌరుషానికి మారు పేరు తెలంగాణ ప్రజలు అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. తానెప్పుడు రాష్ట్రానికి వచ్చినా అపూర్వ స్వాగతం పలుకుతున్నారని చెప్పారు.

Updated : 26 May 2022 15:39 IST

హైదరాబాద్‌: పట్టుదలకు, పౌరుషానికి మారు పేరు తెలంగాణ ప్రజలు అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. తానెప్పుడు రాష్ట్రానికి వచ్చినా అపూర్వ స్వాగతం పలుకుతున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌ పర్యటనలో భాగంగా బేగంపేట విమానాశ్రయంతో దిగిన ప్రధాని.. అక్కడ భాజపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగత సభలో పాల్గొని మాట్లాడారు.

‘‘తెలంగాణ ఉద్యమంలో వేల మంది అమరులయ్యారు. అమరులైన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. వారి ఆశయాలు నెరవేర్చాలి. రాష్ట్ర అభివృద్ధి కోసం  భాజపా కార్యకర్తలు కృషి చేస్తున్నారు. భారతదేశ ఐక్యత కోసం సర్దార్‌ పటేల్‌ ఎంతో కృషి చేశారు. ఒక ఆశయం కోసం వేలమంది ప్రాణత్యాగాలు చేశారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరులతో పాటు ఎవరి ఆశయాలు కూడా నెరవేరడం లేదు. కుటుంబ పాలనలో తెలంగాణ బందీ అయింది. కేవలం ఒక కుటుంబం కోసం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరగలేదు. 

రాష్ట్రంలో భాజపా హవా.. అధికారంలోకి వచ్చి తీరుతాం..

కుటుంబ పార్టీలను తరిమితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయి. తెలంగాణలో అధికార మార్పిడి తప్పక జరుగుతుంది. రాష్ట్రంలో భాజపా హవా కనిపిస్తోంది. ఇక్కడ కూడా అధికారంలోకి వచ్చితీరుతుంది. తెలంగాణ అభివృద్ధి కోసం ఎంత పోరాటమైనా చేస్తాం. యువతతో కలిసి అభివృద్ధి పథంలోకి నడిపిస్తాం.  సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాస్‌,సబ్‌కా విశ్వాస్‌ సూత్రంతో భాజపా పనిచేస్తోంది. కుటుంబపాలన, అవినీతి వల్ల అభివృద్ధి జరగడం లేదు. తెలంగాణ ప్రజలు ఎంత సమర్థులో నాకు తెలుసు. దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదుగుతోంది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా దూసుకెళ్తున్నాం. ఈ 8 ఏళ్లలో వేల స్టార్టప్‌లను ప్రోత్సహించాం’’ అని మోదీ చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని