Modi: ప్రజల నమ్మకాన్ని గెలవాలంటే.. కాంగ్రెస్‌కు అదొక్కటే దారి: మోదీ

కాంగ్రెస్‌ చేసిన పాపాల వల్ల గుజరాత్‌ ఎంతగానో నష్టపోయిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విరుచుకుపడ్డారు. ఆ పార్టీ ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలంటే హస్తం పార్టీ తన సిద్ధాంతాలను మార్చుకోవాలని అన్నారు.

Published : 29 Nov 2022 01:38 IST

అహ్మదాబాద్‌: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ దగ్గరపడుతోన్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం పలు ర్యాలీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్‌పై మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవాలంటే.. ఆ పార్టీ ‘విభజించు - పాలించు’ సిద్ధాంతాన్ని వదిలిపెట్టాలని సూచించారు.

భావ్‌నగర్‌ జిల్లాలో నిర్వహించిన భాజపా ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్‌ సిద్ధాంతమే విభజించు - పాలించు. గుజరాత్‌ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడకముందు.. హస్తం పార్టీ గుజరాతీలు, మరాఠీల మధ్య విభేదాలు సృష్టించింది. ప్రత్యేక రాష్ట్రంగా మారిన తర్వాత కూడా.. ప్రజలను వర్గాల వారీగా విభజించి.. వారు పరస్పరం అల్లర్లకు పాల్పడేలా ప్రేరేపించింది. కాంగ్రెస్‌ చేసిన అలాంటి పాపాల వల్ల గుజరాత్‌ ఎంతగానో నష్టపోయింది. అయితే ఆ తర్వాత, కాంగ్రెస్‌ కుట్రలను అర్థం చేసుకున్న గుజరాతీలు.. ఆ పార్టీకి తలుపులు మూసేశారు. గుజరాత్‌ ఐకమత్యంగా ఉండటంతో కాంగ్రెస్‌ ఓడిపోయింది. ఇకనైనా ఆ పార్టీ.. కులతత్వం, మతతత్వం, ఓటు బ్యాంకు రాజకీయాలు, విభజించు పాలించు వంటి సిద్ధాంతాలను వదిలిపెట్టాలి. అప్పుడే గుజరాత్‌ ప్రజల విశ్వాసాన్ని ఆ పార్టీ చూరగొనగలదు’’ అని మోదీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.

ఇక, రాహుల్‌ నేతృత్వం వహిస్తున్న భారత్‌ జోడో యాత్రలో నర్మదా బచావ్‌ ఆందోళన కార్యకర్త మేధా పాట్కర్‌ పాల్గొనడంపైనా ప్రధాని విమర్శలు గుప్పించారు. 40 ఏళ్ల పాటు సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ ప్రాజెక్టును అడ్డుకున్న వ్యక్తులతో(మేధా పాట్కర్‌ను ఉద్దేశిస్తూ) కలిసి నడిచిన వారిని గుజరాత్‌ ప్రజలు ఎన్నటికీ క్షమించబోరన్నారు. గుజరాత్‌లో భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత గత 20 ఏళ్లుగా రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని మోదీ ఈ సందర్భంగా తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని