బెంగాల్‌లో 20.. అసోంలో 6 ర్యాలీలకు మోదీ! 

దేశంలో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ సందడి మొదలైంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. కీలక నేతలంతా ......

Published : 02 Mar 2021 19:02 IST

దిల్లీ:  దేశంలో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ సందడి మొదలైంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. కీలక నేతలంతా ప్రచార ర్యాలీల్లో పాల్గొని తమ ప్రసంగాలతో రాజకీయాలను  హీటెక్కిస్తున్నారు. తద్వారా ఓటర్లను తమ వైపు ఆకర్షించి అధికార పీఠం దిశగా తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. పశ్చిమబెంగాల్‌, కేరళ, అసోం, తమిళనాడు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలితప్రాంతమైన పుదుచ్చేరి శాసనసభలకు మార్చి/ఏప్రిల్‌ నెలల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే, బెంగాల్‌లో పాగా వేయాలనే పట్టుదలతో భాజపా దూకుడుగా ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీని ప్రచార పర్వంలోకి దించుతోంది. ఎనిమిది విడతల్లో జరగబోయే బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ 20 ర్యాలీల్లో పాల్గొననున్నారు. అలాగే, అసోంలో ఆయన ఆరు ర్యాలీల్లో పాల్గొంటారని సమాచారం. ఈ రెండు రాష్ట్రాల్లో అత్యధిక జిల్లాలను కవర్‌ చేస్తూ ఆయన ప్రచారం సాగేలా కమలనాథులు ప్రణాళికలు రూపొందించినట్టు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లో గణనీయ ఫలితాలు సాధించిన భాజపా.. ఆ ఉత్సాహంతోనే ముందుకెళ్తోంది. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలన్న కసితో నేతలు పని చేస్తున్నారు.

మరోవైపు, మార్చి 7న కోల్‌కతాలోని బ్రిగేడ్‌ మైదానంలో మోదీ తొలి ప్రచార ర్యాలీలో ప్రసంగించనున్నారు. బెంగాల్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధానితో భాజపా అగ్ర నాయకులు అమిత్‌ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్‌ సింగ్‌, యోగి ఆదిత్యనాథ్‌, నితిన్‌ గడ్కరీ, శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, స్మృతి ఇరానీ సహా పలువురు నాయకులు ప్రచారంలో పాల్గొననున్నారు. పశ్చిమబెంగాల్లో మార్చి 27 నుంచి ఏప్రిల్‌ 29 వరకు  మొత్తం ఎనిమిది విడతల్లో ఎన్నికలు జరగనుండగా.. అసోంలో మార్చి 27, ఏప్రిల్‌ 6న రెండు విడతల్లో నిర్వహించనున్నారు. మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని