Published : 31 Dec 2021 01:33 IST

Sharad Pawar: చేతులు కలుపుదామని మోదీ అడిగారు.. సాధ్యం కాదని చెప్పా: శరద్‌ పవార్‌

పుణె: మహారాష్ట్రలో భాజపా, ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరుకున్నారని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శరద్‌ పవార్‌ అన్నారు. అయితే అది సాధ్యం కాదని తాను ప్రధానికి చెప్పినట్లు తెలిపారు. మరాఠి దిన పత్రిక ‘లోక్‌సత్తా’ బుధవారం పుణెలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పవార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2019 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత చోటుచేసుకున్న పరిణామాల గురించి అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానమిచ్చారు.

‘‘అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రధానితో నేను సమావేశమైన మాట నిజమే. ఎన్సీపీ, భాజపా చేతులు కలపాలని ప్రధాని మోదీ కోరుకున్నారు. కానీ నేను పీఎం కార్యాలయానికి వెళ్లి.. అది సాధ్యం కాదని చెప్పివచ్చా. మా సిద్ధాంతాలు వేరని చెప్పా. అయితే దాని గురించి మరోసారి ఆలోచించాలని మోదీ అన్నారు’’ అని పవార్‌ నాటి సంఘటనలను తెలిపారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి 90 రోజులు గడిచినా ప్రభుత్వం ఏర్పాటు కాలేకపోయిందని, బహుశా.. ఎన్సీపీతో పొత్తు పెట్టుకుంటే రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చని ప్రధాని భావించి ఉంటారని అన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల తర్వాత తాను చేసిన వ్యాఖ్యలను పవార్‌ గుర్తుచేసుకున్నారు. ఫడణవీస్‌కు సరైన సంఖ్యాబలం లేకపోతే ఎన్సీపీ దాని గురించి ఆలోచిస్తుందని తాను ఆనాడు చేసిన వ్యాఖ్యలు.. భాజపా, శివసేన మధ్య మరింత దూరం పెంచి ఉంటాయని అభిప్రాయపడ్డారు. 

అధికారంపై ఆశతోనే భాజపా..

పవార్‌ వ్యాఖ్యలకు శివసేన సీనియర్‌ నేత, ఎంపీ సంజయ్‌ రౌత్‌ స్పందిస్తూ భాజపాపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆనాడు పదవీపై వ్యామోహంతో భాజపా ఎవరితోనైనా పొత్తు పెట్టుకునేందుకు సిద్ధపడిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘పవార్‌ చెబుతున్నారంటే ఇది నిజమే అయి ఉంటుంది. ఎందుకంటే అధికారం కోసం ఆ పార్టీ అప్పుడు ఎవరి చేతులు పట్టుకునేందుకైనా సిద్ధపడింది. అయితే భాజపా ఎత్తులు పనిచేయలేదు’’ అని దుయ్యబట్టారు. 

2019 అక్టోబరులో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరికీ సరిపడా మెజార్టీ రాలేదు. ఫలితాలు వెలువడి రోజులు గడుస్తున్నా ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవడంతో రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత మిత్రపక్షం శివసేనకు గట్టి షాకిస్తూ.. ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌తో కలిసి దేవేంద్ర ఫడణవీస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు. ఫడణవీస్‌ సీఎంగా, అజిత్‌ పవార్‌ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం కూడా చేశారు. అయితే అసెంబ్లీ సరైన సంఖ్యాబలం లేకపోవడంతో నాలుగు రోజులకే ఫడణవీస్‌ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత శివసేన-కాంగ్రెస్‌-ఎన్సీపీ కలిసి మహా వికాస్‌ అఘాడీగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్