Politics news: ప్రధాని మోదీ ఇకపై టోపీ ధరిస్తారు!: దిగ్విజయ్‌ సింగ్‌

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన ‘భారత్‌ జోడో యాత్ర’  కారణంగా ఆరెస్సెస్‌ నేతలు మసీదులు, మదర్సాలను దర్శించాల్సి వస్తోందని,  ప్రధాని మోదీ సైతం టోపీ ధరిస్తారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ అన్నారు.

Published : 16 Nov 2022 01:55 IST

దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన ‘భారత్‌ జోడో యాత్ర’ కారణంగా ఆరెస్సెస్‌ నేతలు మసీదులు, మదర్సాలను సందర్శించాల్సి వస్తోందని ఆ పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ అన్నారు. త్వరలో ప్రధాని మోదీ కూడా టోపీ ధరిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. సౌదీ అరేబియా లాంటి దేశాలకు వెళ్లినప్పుడు టోపీ ధరించే ప్రధాని మోదీ.. స్వదేశంలో ఎందుకు దానిని పక్కన పెడతారని ప్రశ్నించారు. జోడో యాత్ర పుణ్యమా అని మోదీ కూడా త్వరలో టోపీ ధరించడం మొదలు పెడతారని అన్నారు. దిల్లీలో నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు.

2011లో మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అహ్మదాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఓ ముస్లిం అభిమాని టోపీ ఇవ్వగా.. దాన్ని మోదీ తిరస్కరించారని దిగ్విజయ్‌ అన్నారు. రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర ప్రారంభించిన తర్వాత సెప్టెంబరులో ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ దిల్లీలోని మసీదు, ఒక మదర్సాను సందర్శించారని, అంతేకాకుండా ఆల్‌ ఇండియా ఇమామ్‌ ఆర్గనైజేషన్‌ చీఫ్‌ ఉమర్‌ అహ్మద్‌ ఇలియాసీతో కూడా సమావేశమయ్యారని తెలిపారు. మరోవైపు ఆరెస్సెస్‌ నేతల మాటల్లోనూ వ్యత్యాసం కనిపిస్తోందని అన్నారు. దేశంలోని పేదలు మరింత పేదలుగా, ధనవంతులు మరింత ధనికులుగా మారుతున్నారని ఆరెస్సెస్‌లోని మరో సీనియర్‌ నేత వ్యాఖ్యానించడమే ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. ఇలా చెప్పుకొంటూ పోతే ‘భారత్‌ జోడో యాత్ర’ శ్రీనగర్‌కు చేరేనాటికి ఇంకెన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయోనని దిగ్విజయ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ.. ఓట్లను చీల్చేందుకే అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌, అసదుద్దీన్‌ ఓవైసీ నాయకత్వంలోని ఏఐఎంఐఎం పోటీ చేస్తున్నాయని అన్నారు. తద్వారా లబ్ది పొందేందుకు అధికార భాజపా ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. ఈ పార్టీలు భాజపాకు బీ టీమ్‌ పార్టీలు అని దిగ్విజయ్‌ సింగ్‌ ఆరోపించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని