UP Election 2022: అందుకే వాళ్లకు కడుపులో గడబిడ..

భాజపా అధికారంలోకి రావడం ఇప్పుడు యూపీకి అత్యవసరమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు ఆయన ప్రత్యక్ష ప్రచారంలో పాల్గొన్నారు. అలాగే వంశపారంపర్య రాజకీయాలను ఎండగట్టారు. ఆ తరహా పార్టీలు అధికారంలో ఉంటే.. కొవిడ్ టీకాలను వీధుల్లో అమ్మకానికి పెట్టేవారని కాంగ్రెస్‌, ఎస్పీపై విమర్శలు గుప్పించారు. 

Updated : 10 Feb 2022 14:58 IST

షహరాన్‌పూర్‌: భాజపా అధికారంలోకి రావడం ఇప్పుడు యూపీకి అత్యవసరమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు షహరాన్‌పూర్‌లో ఆయన ప్రత్యక్ష ప్రచారంలో పాల్గొన్నారు. అలాగే వంశపారంపర్య రాజకీయాలను ఎండగట్టారు. ఆ తరహా పార్టీలు అధికారంలో ఉంటే.. కొవిడ్ టీకాలను వీధుల్లో అమ్మకానికి పెట్టేవారని కాంగ్రెస్‌, ఎస్పీపై విమర్శలు గుప్పించారు. 

‘యూపీని ఎవరు అభివృద్ధి చేశారో వారికి ఓటు వేసేందుకు ప్రజలు నిర్ణయించుకున్నారు. అల్లర్లు జరగకుండా, మహిళలకు భయం లేకుండా చేసిన, నేరగాళ్లను జైళ్లలో పెట్టిన ప్రభుత్వానికి వారు ఓటు వేయనున్నారు’ అని యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల గురించి వెల్లడించారు. అలాగే వంశపారంపర్య రాజకీయ పార్టీలు అధికారంలోఉండి ఉంటే.. వారు టీకాలను బజార్లలో అమ్మకానికి పెట్టేవారని విమర్శించారు. ఫలితంగా కొవిడ్‌తో ప్రాణాలు గాల్లో కలిసేవని మండిపడ్డారు. అంతేగాకుండా ముజఫర్‌నగర్, షహరాన్‌పూర్‌లో జరిగిన అల్లర్ల గురించి ప్రస్తావిస్తూ.. ఎస్పీ ఆ అల్లర్లకు మద్దతుదారంటూ వ్యాఖ్యానించారు.

త్రిపుల్‌ తలాక్‌పై నిషేధం గురించి మాట్లాడుతూ.. యోగి ప్రభుత్వం సంస్కరణలను కొనసాగిస్తుందన్నారు. ‘మేం ముస్లిం మహిళలను త్రిపుల్‌ తలాక్‌ దౌర్జన్యం నుంచి కాపాడాం. ఎప్పుడైతే వారు బయటకు వచ్చి భాజపాకు మద్దతు పలుకుతున్నారో.. కొందరికి కడుపులో గడబిడ మొదలైంది. దాంతో ముస్లిం మహిళల పురోగతిని ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ మేం వారి కోసం నిలబడతాం’ అని మోదీ భరోసా ఇచ్చారు.  

ప్రస్తుతం యూపీ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ఓటింగ్‌లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి 35.03 శాతం పోలింగ్ జరిగినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ రాష్ట్రంలో మొత్తం ఏడు విడతలుగా ఎన్నికలు జరుగుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని