Updated : 26 Jun 2022 13:25 IST

Kollapur: జూపల్లి vs బీరం.. కొల్లాపూర్‌లో హీటెక్కిన తెరాస రాజకీయం..!

ఎమ్మెల్యే హర్షవర్ధన్‌ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు

కొల్లాపూర్‌: నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో చర్చకు వెళ్తుండగా ఎమ్మెల్యేను అరెస్టు చేసి ఇతర ప్రదేశానికి తరలించారు. దీంతో బస్టాండ్‌ వద్ద ఎమ్మెల్యే బీరం వర్గీయులు ఆందోళనకు దిగారు. కొల్లాపూర్‌ నియోజకవర్గంలోని అధికార తెరాసలో వీరిద్దరూ రెండు వర్గాలుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

అభివృద్ధిపై వీరిద్దరి సవాళ్లతో కొల్లాపూర్‌లో కొద్దిరోజులుగా రాజకీయం హీటెక్కింది. తమ బహిరంగ చర్చకు ఇవాళ అనుమతివ్వాలంటూ ఇరువర్గాల నుంచి దరఖాస్తులు వెళ్లినా.. శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు తిరస్కరించారు. అయినప్పటికీ సై అంటే సై అంటూ జూపల్లి కృష్ణారావు, బీరం హర్షవర్ధన్‌ రెడ్డి పట్టుదలతో ఉండటంతో.. ఏం జరుగుతుందోనని ప్రజల్లో ఆసక్తి పెరిగింది. మరోవైపు కొల్లాపూర్‌లో పోలీసులు భారీగా మోహరించారు. ఇరువర్గాలను గృహనిర్బంధం చేసి, నేతల ఇళ్లకు వెళ్లే మార్గాల్లో ఎవరినీ అనుమతించడం లేదు. ఈ క్రమంలో ఎమ్మెల్యే హర్షన్‌వర్ధన్‌ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం.

చౌరస్తాకు కాదు.. నేరుగా ఇంటికే వస్తా..

ఇటీవల జూపల్లి కృష్ణారావు విసిరిన సవాలు స్వీకరిస్తున్నానని, కొల్లాపూర్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్దకు కాకుండా ఆయన ఇంటికే వెళ్లి చర్చిస్తానని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి  వెల్లడించారు. గతంలో చాలాసార్లు మాజీ మంత్రి సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారని తెలిపారు. బ్యాంకుల లూటీ నుంచి ఎంతోమంది నేతల హత్యలు, ఆత్మహత్యలు, రాజకీయ వేధింపులు, అక్రమ దందాలపై వెల్లడిస్తానని చెప్పారు. జూపల్లి తెరాసలోనే ఉంటూ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి తనపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని పేర్కొన్నారు.

నేను అప్పు చేశా.. కానీ తప్పుచేయలేదు: జూపల్లి

ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌ రెడ్డి తనపై నిరాధార ఆరోపణలు చేశారని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. తాను చేసిన సవాల్‌కు 100 శాతం కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. కొల్లాపూర్‌లో ఎమ్మెల్యే బీరం అరెస్టైన కొద్దిసేపటి తర్వాత జూపల్లి మీడియాతో మాట్లాడారు. ‘‘పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పునరావాసం పూర్తి కాలేదు. ముంపు బాధితులకు సరైన పరిహారం అందలేదు. వర్షం పడితే ఊరు ఖాళీ చేయాల్సిన పరిస్థితి. సమస్య పరిష్కరించకుండా ఎమ్మెల్యే నాపై నిందారోపణలు చేశారు. నేను సంపాదించిన పేరు, ప్రతిష్టలను మసకబార్చే ప్రయత్నం చేశారు. మంచి చేసి పేరు సంపాదించాలి.. కానీ చౌకబారు రాజకీయాలెందుకు?

నాపై చేసిన ఆరోపణలపై చర్చకు సిద్ధమా? అని ఎమ్మెల్యేకు సవాల్‌ చేశా. తప్పు చేసినోడు తలవంచుకొని పోతాడు.. నేను తప్పు చేయలేదు. మచ్చలేని నా రాజకీయ జీవితంపై బీరం ఆరోపణలు చేశారు. ధైర్యముంటే అంబేడ్కర్‌ చౌరస్తాకు రమ్మని 15 రోజులు సమయమిచ్చా. అంబేడ్కర్‌ చౌరస్తాలో సంత నిర్వహణకు ఇబ్బంది అవుతుంది.. మీ ఇంటికొస్తానని అన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎదురు చూశా.. ఎమ్మెల్యే రాలేదు. నా వద్దకు వచ్చేందుకు ధైర్యం చాలక అరెస్టు చేయించుకున్నారు. తన వర్గీయులకు మాత్రమే ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి మేలు చేశారు. మా ఇద్దరి మధ్య ఉన్న తగాదాతో తెరాసకు సంబంధం లేదు. నేను అప్పు చేశా.. కానీ తప్పుచేయలేదు. 1996లో రూ. 1.30 కోట్లు రుణం తీసుకున్నా. వడ్డీతో సహా చెల్లిస్తే బ్యాంకు నాకు ఒక ధ్రువపత్రం ఇచ్చింది. ఫ్రుడెన్షియల్‌ బ్యాంక్‌లో 1995లో రూ.6 కోట్లు రుణం తీసుకున్నా. సకాలంలో వడ్డీ చెల్లించకపోవడంతో రూ.14 కోట్లకు సెటిల్‌మెంట్‌ చేశా’’ అని జూపల్లి విరించారు.Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts