Revanth vs MallaReddy: సవాళ్లతో వేడెక్కిన తెలంగాణ రాజకీయం!

మంత్రి మల్లారెడ్డిపై రేవంత్ కామెంట్లతో ఒక్కసారిగా వేడెక్కిన తెలంగాణ రాజకీయం..

Updated : 27 Aug 2021 14:49 IST

తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మంత్రి మల్లారెడ్డిపై రేవంత్ కామెంట్లతో రచ్చ మొదలైంది. ఒకరికొకరు మాటల తూటాలతో రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు. రేవంత్ తనపై పోటీ చేయాలని మంత్రి మల్లారెడ్డి తొడకొట్టి సవాల్ విసిరితే.. కాదు కాదు గజ్వేల్‌లో రేవంత్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌ గెలవాలని కాంగ్రెస్ నేతలు ప్రతి సవాల్ చేశారు.

సవాళ్లు- ప్రతిసవాళ్లు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ దత్తత గ్రామం మూడు చింతలపల్లిలో దళిత-గిరిజన ఆత్మ గౌరవ దీక్ష ముగింపు సందర్భంగా మంత్రి మల్లారెడ్డి విద్యా సంస్థలకు ఎలాంటి అనుమతులు లేవని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ చేసిన సంచలన ఆరోపణలు.. ప్రతిగా తొడకొట్టి మంత్రి విసిరిన సవాల్‌ రాజకీయాలను వేడిపుట్టిస్తున్నాయి. రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై చేసిన ఆరోపణలు నిజమైతే.. తాను రాజీనామాకు సిద్ధమని లేదంటే రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని సవాల్‌ విసిరారు. నువ్వా.. నేనా అంటూ రేవంత్‌, మల్లారెడ్డిలు ఒకరికొకరు చేసుకున్న సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయాలు హైపిచ్‌కు చేరాయి. తనపై పోటీ చేసి రేవంత్‌ గెలవాలని మంత్రి మల్లారెడ్డి తొడకొట్టి సవాల్‌ చేస్తే.. గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ రాజీనామా చేసి రేవంత్‌ రెడ్డిపై గెలవాలని అద్దంకి దయాకర్‌ సవాల్‌ విసిరారు. అవినీతి, అక్రమాలపై మాట్లాడితే మల్లారెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఎద్దేవా చేశారు. మంత్రి పదవిలో ఉండి నోటికొచ్చినట్లు మాట్లాడటం సరైందేనా అని ప్రశ్నించారు.  

పద్ధతి మార్చుకోకపోతే..

మూడుచింతలపల్లిలో రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డ తెరాస ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి.. అధికారంలోకి రాలేమనే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ నేతలు భూములు కబ్జా చేస్తే ఆధారాలతో బయటపెట్టాలన్న ఆయన, ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. మరోవైపు కాంగ్రెస్‌, తెరాస నేతల మాటల తూటాలు కార్యకర్తల ఆందోళన వరకూ వెళ్లాయి. బోయిన్‌పల్లిలోని మంత్రి మల్లారెడ్డి నివాసాన్ని యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ముట్టడించారు. ఆందోళనకారులు ఒక్కసారిగా మల్లారెడ్డి నివాసంవైపు దూసుకురావడంతో పోలీసులు అరెస్టు చేశారు. దీనికి ప్రతిగా బోయిన్‌పల్లి కూడలి వద్ద రేవంత్‌ రెడ్డి దిష్టి బొమ్మను తెరాస నాయకులు దహనం చేశారు. రేవంత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని