Budget 2023: కేంద్ర బడ్జెట్‌పై ఎవరేం అన్నారంటే..?

పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై రాజకీయ ప్రముఖులు తమ స్పందనలు తెలిపారు. 

Updated : 01 Feb 2023 22:30 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌(Union Budget 2023)పై అధికార పార్టీ నేతలు ప్రశంసలు కురిపిస్తుండగా.. విపక్షాలు మాత్రం పెదవి విరుస్తున్నాయి. అమృత్‌ కాల్‌ బడ్జెట్‌ అని కేంద్రం పేర్కొనగా.. ఇది కేవలం కొద్దిమంది సంపన్నులకు మేలు చేసే ‘మిత్ర్‌ కాల్‌ బడ్జెట్‌’ అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమర్శించారు. ఆయా రాజకీయ పార్టీలకు చెందిన నేతలు బడ్జెట్‌పై ఎలా స్పందించారో గమనిస్తే..

దేశాభివృద్ధికి బలమైన పునాది: ప్రధాని మోదీ

వచ్చే 25 ఏళ్ల అమృత కాలానికి ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌ దేశాభివృద్ధికి బలమైన పునాది అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రైతులు సహా అన్ని వర్గాల కలల్ని ఈ బడ్జెట్‌ సాకారం చేస్తుందని చెప్పారు. మహిళా సాధికారత మరింత పెరిగేలా దోహదం చేస్తుందన్నారు. ఇది చారిత్రక బడ్జెట్‌ అని కొనియాడిన ప్రధాని.. మధ్యతరగతి ప్రజల కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని హామీ ఇచ్చారు. పన్నులు తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించామని తెలిపారు. 

‘మిత్ర్‌కాల్‌’ బడ్జెట్‌.. దేశ భవిష్యత్తుకు రోడ్‌మ్యాప్‌ లేదు: రాహుల్‌

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ దేశ భవిష్యత్తుకు దారిచూపేలా కనబడటంలేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పెదవి విరిచారు. దీన్ని ‘మిత్ర్‌కాల్‌ బడ్జెట్‌’గా పేర్కొన్న రాహుల్‌.. ‘‘ఈ బడ్జెట్‌కు ఉద్యోగాల కల్పనలో విజన్‌ లేదు.. ధరల పెరుగుదలను నియంత్రించే ప్రణాళిక లేదు. పెరుగుతోన్న ఆర్థిక అసమానతలకు కళ్లెంవేసే ఉద్దేశం ఎక్కడా లేదు’’ అని పేర్కొన్నారు.  దేశంలో 1శాతం సంపన్నుల వద్ద 40శాతం సంపద ఉంటే.. 50శాతం మంది పేద ప్రజలు 64శాతం మేర జీఎస్టీ చెల్లిస్తున్నారన్నారు. దేశంలో 42శాతం మంది నిరుద్యోగులు ఉన్నా.. ప్రధాని లెక్కచేయడంలేదని రాహుల్‌ ట్విటర్‌లో విమర్శించారు. 

హామీలెక్కువ.. అమలు చేసేది తక్కువ: జైరాం రమేశ్‌

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్‌ స్పందించారు. గతేడాది బడ్జెట్‌లో కేటాయించిన దానికంటే ఖర్చు చేసింది తక్కువగా ఉందన్నారు. ఈ బడ్జెట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ హెడ్‌లైన్‌ మేనేజ్‌మెంట్ వ్యూహంగా అభివర్ణించిన జైరాం.. ఇందులో హామీలు ఎక్కువ.. అమలుచేసేది తక్కువ అనేచందంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. 

ఇది ప్రజా వ్యతిరేక, ‘చీకటి’ బట్జెట్‌: దీదీ

కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ప్రజా వ్యతిరేక, చీకటి బడ్జెట్‌ అని పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. ఆదాయ పన్ను  శ్లాబుల్లో చేసిన మార్పులతో ఎవరికీ మేలు జరగదన్నారు. ఈ బడ్జెట్‌.. భవిష్యత్తును పక్కనబెట్టి పూర్తి అవకాశవాదంగా, ప్రజలు, పేదలకు వ్యతిరేకంగా ఉందన్నారు. ఒకేఒక్క తరగతి ప్రజలకు లబ్దిచేకూరుస్తుందని విమర్శించారు. దేశంలోని నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు దోహదం చేయదని.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని చేశారని ధ్వజమెత్తారు. తనకు అరగంట సమయం ఇస్తే పేదలను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్‌ ఎలా రూపొందించాలో చూపిస్తానన్నారు. 

రైల్వే బడ్జెట్‌ కేటాయింపులు భేష్‌: అశ్వినీ వైష్ణవ్‌

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రైల్వేశాఖకు రూ. 2.41 లక్షల కోట్లు కేటాయించడంపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఈ కేటాయింపులు ప్రయాణికుల ఆకాంక్షలను నెరవేరుస్తుంది.  'అమృత్ భారత్ స్టేషన్' పథకం కింద, 1,275 స్టేషన్లను తిరిగి అభివృద్ధి చేస్తాం.  దేశంలోని ప్రతి మారుమూల ప్రాంతాలకు వందే భారత్‌ రైళ్ల సేవలు అందించాలన్న ప్రధాని మోదీ కలకు ఇది దోహదపడుతుంది’’ అని మంత్రి తెలిపారు. 

దిల్లీపై కేంద్రానికి సవతి తల్లి ప్రేమ: కేజ్రీవాల్‌

బడ్జెట్‌లో కేటాయింపులపై దిల్లీ సీఎం కేజ్రీవాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దిల్లీపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందన్నారు. గతేడాది దిల్లీ ప్రజలు అత్యధికంగా రూ. 1.75 లక్షల కోట్లు ఆదాయపన్ను చెల్లించినప్పటికీ, 2023-24 బడ్జెట్‌లో మాత్రం కేవలం రూ.325 కోట్లు కేటాయించిన కేంద్రం తీరును ఆయన తప్పుబట్టారు. ఈ బడ్జెట్‌ ద్రవోల్బణాన్ని పెంచుతుందన్నారు. విద్యారంగానికి కేటాయింపులు తగ్గించడాన్ని సైతం కేజ్రీవాల్‌ తప్పుబట్టారు. 

ఇది నిరాశాజనక బడ్జెట్‌: అఖిలేశ్‌

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ నిరాశాజనకంగా ఉందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు. బడ్జెట్‌తో మున్ముందు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగిపోతుందని పేర్కొన్నారు. దాదాపు పదేళ్లుగా బడ్జెట్‌ను ప్రవేశపెడుతోన్న భాజపా.. ఇంతకుముందు ప్రజలకు ఏమీ ఇవ్వనప్పుడు.. ఇప్పుడు మాత్రం ఏం ఇస్తుందిలే.. అని ట్వీట్‌ చేశారు. ఈ బడ్జెట్‌ ఆశకు బదులుగా రైతులు, కార్మికులు, యువకులు, మహిళలు, ఉద్యోగులు, వ్యాపార వర్గాలన్నింటినీ నిరాశకు గురిచేసిందని ఆవేదన వ్యక్తంచేశారు.

సుంకాల తగ్గింపుతో ఎగుమతుల రంగం బలోపేతం: పీయూష్‌ గోయల్‌

పలు ఉత్పత్తులపై కస్టమ్‌ సుంకాల తగ్గింపుతో భారత ఎగుమతుల రంగం మరింత వృద్ధి సాధిస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న మాంద్యం భయాలు ఎగుమతుల రంగంపై ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎగుమతుల్ని ప్రోత్సహించేలా పలు ఉత్పత్తులపై సుంకాలను తగ్గించినట్టు తెలిపారు. దాంతోపాటు దేశీయంగా ఈవీలను తయారీని ప్రోత్సహించేందుకు లిథియమ్‌-అయాన్‌ బ్యాటరీలపై దిగుమతి సుంకాన్ని తగ్గించినట్లు మంత్రి తెలిపారు.

ఆర్థిక అసమానతలకు పరిష్కారం ఏదీ: విజయన్‌

ఈ బడ్జెట్‌ దేశంలో ఉన్న అసమానతల్ని పరిష్కరించే ప్రయత్నం చేయలేదని కేరళ సీఎం పినరయి విజయన్‌ అన్నారు. తమ రాష్ట్రం ఎంతో కాలంగా డిమాండ్‌ చేస్తోన్న ఎయిమ్స్‌,  రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులను ప్రస్తావించకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. గ్రామీణ ఉపాధి హామీవంటి కీలక పథకాలు, ఆహార సబ్సిడీలకు గణనీయంగా కేటాయింపులు తగ్గిస్తున్నారంటూ కేరళ ఆర్థిక మంత్రి బాలగోపాల్‌ ఆవేదన వ్యక్తంచేశారు.

అన్ని వర్గాలకూ మేలు చేసే బడ్జెట్‌: అనురాగ్‌

కేంద్రం 2023 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అన్ని వర్గాల వారికి మేలు చేకూర్చేలా ఉందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌ అన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులు ఆకర్షించడం, సామర్థ్య విస్తరణ, హరిత అభివృద్ధి, యువశక్తి, ఆర్థిక రంగం బలోపేతం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు.

భాజపా పాలిత రాష్ట్రాల బడ్జెట్‌: స్టాలిన్‌

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2023 భాజపా పాలిత రాష్ట్రాల్లో ప్రాజెక్టుల అభివృద్ధి కోసం చేసిన కసరత్తుగా తమిళనాడు సీఎం స్టాలిన్‌ అన్నారు. త్వరలో ఎన్నికల జరగనున్న రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకుని భాజపా సర్కార్‌ ఈ బడ్జెట్‌ రూపొందించిందని విమర్శించారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం వంటి ముఖ్యమైన వాటిని ఈ బడ్జెట్లో పూర్తిగా విస్మరించారని పేర్కొన్నారు. భాజపాయేతర పాలిత రాష్ట్రాలకు ఈ బడ్జెట్‌లో పూర్తిగా మొండిచేయి చూపారని దుయ్యబట్టారు. 

శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థకు పునాది: యోగి ఆదిత్యనాథ్‌

నవ భారత నిర్మాణమే లక్ష్యంగా బడ్జెట్‌ రూపకల్పన జరిగిందని ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తెలిపారు. దేశంలోని అన్ని వర్గాల వారి ఆశలు, ఆంకాక్షలు నెరవేర్చేలా బడ్జెట్‌ రూపొందించారని పేర్కొన్నారు. పేదలు, రైతులు, యువత, మహిళలకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇది భారత్‌ను శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా మారుస్తుందనడంలో ఎలాంటి సందేహంలేదని అన్నారు. 

అందమైన మాటలు తప్ప కేటాయింపుల్లేని డొల్ల బడ్జెట్‌: హరీశ్‌రావు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ (Budget 2023)లో డొల్లతనం కనిపిస్తోందని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. అందమైన మాటలు తప్ప కేటాయింపులు లేని డొల్ల బడ్జెట్‌గా అభివర్ణించారు. బడ్జెట్‌లో ఏడు ప్రాధాన్యత రంగాలను కేంద్రం గాలికొదిలేసిందన్నారు.  తెలంగాణకు మరోసారి తీవ్ర అన్యాయం చేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు. విభజన హామీల అమలు ప్రస్తావనే లేదని.. 9 ఏళ్లుగా అడుగుతుంటే రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఊసేలేదని అసహనం వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని