Mamata: దేశంలో పరిస్థితి బాగోలేదు: భాజపాపై దీదీ ఫైర్‌

దేశంలో ప్రస్తుత పరిస్థితులు ఏమీ బాగాలేదని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ......

Published : 04 May 2022 02:25 IST

కోల్‌కతా: దేశంలో ప్రస్తుత పరిస్థితులు ఏమీ బాగాలేదని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఏకపక్ష రాజకీయాలు ఏమాత్రం ఆహ్వానించదగినవి కాదని వ్యాఖ్యానించారు. ఈద్‌ సందర్భంగా కోల్‌కతాలోని రెడ్‌ రోడ్డులో జరిగిన ప్రార్థనల్లో దాదాపు 14వేల మంది పాల్గొనగా.. వారినుద్దేశించి మమత కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలెవరూ భయపడొద్దనీ.. మంచి భవిష్యత్తు కోసం ఐక్యతతో మెలగాలని ఈ సందర్భంగా దీదీ విజ్ఞప్తి చేశారు. దేశాన్ని విభజించి ప్రజల్ని అణిచివేసేందుకు ప్రయత్నించే శక్తులపై పోరాడాలని పిలుపునిచ్చారు. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత రెడ్‌ రోడ్‌లో ఈ చారిత్రక ఈద్‌ ప్రార్థనల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని దీదీ అన్నారు. ‘‘దేశంలో పరిస్థితి ఏమీ బాగాలేదు. విభజించి పాలించే విధానం, ఒంటరి రాజకీయాలు మంచివి కాదు.  సమాజంలో చీలిక తీసుకొచ్చేందుకు కొందరు అసూయపరులు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. భయపడొద్దు.. ఐక్యంగా పోరాడుతూనే ఉండండి’’ అని కోరారు. 

బెంగాల్‌లో ప్రజల మధ్య ఐక్యత చూసి ఓర్వలేకే తనను దూషిస్తున్నారంటూ భాజపాను ఉద్దేశించి దీదీ వ్యాఖ్యానించారు. ఎన్ని అవమానాలకు గురించేసినా తాను భయపడబోననీ.. వాటిని ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసన్నారు.‘‘దేశాన్ని విభజించాలనుకునే, ప్రజలను అణచివేసే శక్తికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలి. మనమంతా ఏకమై ఆ శక్తుల్ని దేశం నుంచి తరిమికొట్టాలి. సంతోషంగా ఉండండి. నాపై నమ్మకం ఉంచండి. ఈరోజు మీకు హామీ ఇస్తున్నా.. ముస్లింలైనా, హిందువులైనా, సిక్కులైనా, జైనులైనా నేను బతికున్నంత వరకు మీ సమస్యలపై పోరాడుతూనే ఉంటా. పోరాడగలిగే శక్తిని నేను మీ నుంచే పొందా. నేను గానీ, నా పార్టీ గానీ, ప్రభుత్వంగానీ మిమ్మల్ని బాధపెట్టే ఏ పని చేయదు అని హామీ ఇస్తున్నా’’ అని తన ప్రసంగంలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని