కశ్మీరీ పండిట్లకు అన్యాయం జరుగుతోంది

కేంద్ర ప్రభుత్వ అధీనంలోని జమ్మూకశ్మీర్‌ పాలనా యంత్రాంగం చేతుల్లో కశ్మీరీ పండిట్లకు అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు.

Published : 24 Jan 2023 04:30 IST

ఎల్‌జీ వారికి క్షమాపణలు చెప్పాలి
జోడో యాత్రలో రాహుల్‌ డిమాండ్‌
జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా దక్కేలా కాంగ్రెస్‌ కృషి చేస్తుందని ప్రకటన

జమ్మూ: కేంద్ర ప్రభుత్వ అధీనంలోని జమ్మూకశ్మీర్‌ పాలనా యంత్రాంగం చేతుల్లో కశ్మీరీ పండిట్లకు అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. ‘ప్రధానమంత్రి ప్యాకేజీ కింద ఉపాధి పొందిన పండిట్లు భిక్షను ఆశించకూడదు’ అంటూ జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్‌జీ) మనోజ్‌ సిన్హా చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెంటనే పండిట్లకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. సాంబా జిల్లాలో భారత్‌ జోడో యాత్ర చేస్తున్న రాహుల్‌ను కశ్మీరీ పండిట్ల ప్రతినిధి బృందం సోమవారం ఉదయం కలుసుకుంది. ఈ సందర్భంగా ఉగ్రవాదులు తమపై చేపడుతున్న ‘లక్షిత హత్యలు’ సహా తాము ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఆయనకు వివరించింది. ప్రధాన మంత్రి ప్యాకేజీ కింద ఉద్యోగాలు పొందిన వారు చేపట్టిన నిరసన గురించి తెలిపింది. ఈ నేపథ్యంలో రాహుల్‌ సట్వారీలో తన రోజువారీ యాత్ర ముగింపు సందర్భంగా అక్కడ కొందరిని ఉద్దేశించి ప్రసంగించారు. కశ్మీరీ పండిట్లు తమ హక్కులను కోరుకుంటున్నారు తప్ప భిక్షను కాదని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. ఎల్‌జీ వారిని క్షమాపణలు కోరాలన్నారు. మరోపక్క జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కోసం కాంగ్రెస్‌ తన పూర్తి శక్తియుక్తులను వినియోగిస్తుందని రాహుల్‌ ప్రకటించారు. ఈ కేంద్రపాలిత ప్రాంతంలో అత్యధిక స్థాయిలో నిరుద్యోగం తాండవిస్తోందని ఆరోపించారు. తన యాత్రలో భాగంగా జమ్మూలోని రఘునాథ దేవాలయంలో పూజలు నిర్వహించారు. సాంబా జిల్లాలోకి జోడో యాత్ర అడుగిడిన సందర్భంగా స్థానిక నేతలు, కార్యకర్తలు రాహుల్‌కు పెద్దఎత్తున స్వాగతం పలికారు. ఈ క్రమంలో అధికారులు ఆయన భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

మా టౌన్‌షిప్‌ను దర్శించండి

పండిట్ల ప్రతినిధి బృందంలో సభ్యుడైన సామాజిక కార్యకర్త అమిత్‌ కౌల్‌ మాట్లాడుతూ..జమ్మూ-శ్రీనగర్‌ జాతీయ రహదారిపై తాము నివాసం ఉంటున్న జగ్తీ టౌన్‌షిప్‌ను సందర్శించాలని రాహుల్‌ను కోరినట్లు తెలిపారు. త్వరలో ఆయన వచ్చే అవకాశం ఉందన్నారు.

లోయ ఆవల పునరావాసం కల్పించాలి

ప్రధానమంత్రి ఉపాధి ప్యాకేజీ (2008) కింద కశ్మీర్‌ లోయలో 4000 మంది కశ్మీరీ పండిట్లు వివిధ శాఖల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. గతేడాది మే 12న బుద్గామ్‌ జిల్లాలో తమ సహోద్యోగి రాహుల్‌ భట్‌ను ఉగ్రవాదులు లక్ష్యిత హత్యల్లో భాగంగా హతమార్చడంతో వారిలో చాలామంది ఉద్యోగులు జమ్మూకు తరలిపోయారు. కశ్మీర్‌ లోయ ఆవల తమకు పునరావాసం కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని