సంక్షిప్త వార్తలు (9)
పదవికి అమ్ముడుపోయి కాపుల భవిష్యత్తును నాశనం చేయొద్దంటూ మంత్రి అమర్‌నాథ్‌కు కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య ఆదివారం లేఖ రాశారు.
కాపుల భవిష్యత్తును నాశనం చేయొద్దు
మంత్రి అమర్‌నాథ్‌కు హరిరామజోగయ్య లేఖ
పాలకొల్లు, విశాఖపట్నం న్యూస్‌టుడే: పదవికి అమ్ముడుపోయి కాపుల భవిష్యత్తును నాశనం చేయొద్దంటూ మంత్రి అమర్‌నాథ్‌కు కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య ఆదివారం లేఖ రాశారు. ‘రాజకీయాల్లో పైకి రావాల్సిన వాడివి... అనవసరంగా పవన్‌కల్యాణ్‌పై బురద చల్లే ప్రయత్నం చేస్తే నీకు భవిష్యత్తు ఉండదు. నీ మంచి కోరి చెబుతున్నా’ అని మంత్రికి హితవు పలికారు.
అది పవన్‌కు రాయాల్సిన లేఖలా ఉంది: మంత్రి అమర్‌నాథ్
హరిరామజోగయ్య రాసిన లేఖకు మంత్రి అమర్‌నాథ్ బదులిచ్చారు. ‘కాపుల భవిష్యత్తు విషయంపై.. చంద్రబాబుతో జతకడుతున్న పవన్‌కల్యాణ్‌కు రాయాల్సిన, చెప్పాల్సిన అంశాలపై పొరపాటున నాకు లేఖ రాశారు. మీరు ఆయురారోగ్యాలతో పాటు మానసికంగా దృఢంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నా’ అని మంత్రి లేఖలో పేర్కొన్నారు.
రాజకీయ పార్టీగా బీసీ సంక్షేమ సంఘం!
మాచర్లగ్రామీణ, న్యూస్‌టుడే: బీసీ సంక్షేమ సంఘాన్ని రాజకీయ పార్టీగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు తెలిపారు. ఆదివారం పట్టణంలోని రైల్వేస్టేషన్ వీధిలో బీసీ సంక్షేమ సంఘ కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. బీసీల కులగణనపై పోరాడుతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా మాచర్లకు చెందిన బృంగా రమణను రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు అందజేశారు.
10న ఏపీలో ఆందోళనలు: సీపీఐ
విజయవాడ, న్యూస్‌టుడే: కేంద్ర బడ్జెట్‌లో పేద, మధ్య తరగతి వర్గాలను విస్మరిస్తూ.. కేవలం సంపన్నులకే పెద్దపీట వేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఆదివారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్‌ను నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు.
రాజకీయాలను మలుపు తిప్పనున్న ప్లీనరీ సమావేశాలు
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్
రాయ్‌పుర్: త్వరలో జరగనున్న కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు దేశ రాజకీయాలను మలుపు తిప్పుతాయని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ స్పష్టం చేశారు. ఫిబ్రవరి 24 నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌లో జరగనున్న ఈ సమావేశాల ఏర్పాట్లను పరిశీలించడానికి ఆదివారం ఆయన రాష్ట్రానికి చేరుకున్నారు. సభ నిర్వహించనున్న రాజ్యోత్సవ స్థల్‌ను సందర్శించారు. అంతకుమందు దిల్లీ నుంచి వచ్చిన వేణుగోపాల్, పవన్ బన్సాల్, తారిఖ్ అన్వర్‌లకు విమానాశ్రయంలో సీఎం భూపేశ్ బాఘేల్, ఇతర మంత్రులు స్వాగతం పలికారు. సంప్రదాయం ప్రకారం ఈ ప్లీనరీలోనే ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే పేరును పీసీసీ అధ్యక్షులు ఆమోదించనున్నారు.
మద్యం ఆదాయాన్ని దండుకునేందుకే డిజిటల్ చెల్లింపులకు నిరాకరణ
తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్
ఈనాడు డిజిటల్, అమరావతి: అక్రమ మార్గంలో మద్యం ఆదాయాన్ని దండుకునేందుకే జగన్‌రెడ్డి ప్రభుత్వం మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులకు అనుమతించడం లేదని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. 2021లో ఓ కేసు సందర్భంగా న్యాయస్థానం నుంచి మొట్టికాయలు తప్పించుకోడానికి ఇప్పుడు 11 దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులకు అనుమతిచ్చారని ఆదివారం ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. ‘అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు 11 మద్యం దుకాణాల్లోనే డిజిటల్ చెల్లింపులకు అనుమతివ్వడం ఏంటి? రోడ్డు పక్కన పండ్ల రసాలు, సోడాలు అమ్ముకునే బండ్లపై కూడా గూగుల్‌పే, ఫోన్‌పేలతో చెల్లింపులు చేస్తున్నారు. మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపుల విధానం తీసుకురావడానికి ప్రభుత్వానికి ఇబ్బందేంటి? పన్నులు, విద్యుత్తు బిల్లుల చెల్లింపు, టికెట్ల బుకింగ్ మొదలుకుని రెస్టారెంట్ల నుంచి ఆహారాన్ని తెప్పించుకోవడం వరకు అంతా డిజిటల్ చెల్లింపుల ద్వారానే జరుగుతోంది. ఒక్క మద్యం అమ్మకాల విషయంలో మాత్రం వైకాపా ప్రభుత్వం నగదునే తీసుకుంటోంది’ అని మండిపడ్డారు.
దురుద్దేశంతోనే అస్సాం అరెస్టులు: ఒవైసీ
లఖ్‌నవూ: అస్సాంలో బాల్యవివాహాల కట్టడి పేరిట ప్రభుత్వం దురుద్దేశంతో అరెస్టులకు పాల్పడుతోందని, ఇది పూర్తిగా భాజపా పాలనా వైఫల్యమని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ధ్వజమెత్తారు. ఆదివారం పీటీఐతో ఆయన మాట్లాడుతూ.. ఈ అరెస్టులతో నిరాదరణకు గురైన పేద మహిళలను, పిల్లలను ఎవరు ఆదుకొంటారని ప్రశ్నించారు.
ఏపీలో వైకాపా ఎమ్మెల్యేలకూ రక్షణ లేదు: గిడుగు రుద్రరాజు
చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: ‘ఏపీ ప్రభుత్వం వాలంటీరు వ్యవస్థను తెచ్చి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసింది. సీఎం పేషీలో, సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం తమకు వేతనాలివ్వాలని గవర్నర్‌ను కలసి వినతిపత్రం అందించారంటే ప్రభుత్వ దుస్థితిని అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోంది. వైకాపా ఎమ్మెల్యేలకూ రక్షణ లేదు. వారి ఫోన్లనూ ట్యాప్ చేస్తున్నారు’ అని ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు విమర్శించారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు మద్దతుగా ఆదివారం పెంటపాడు నుంచి చింతపల్లి వరకు 5 కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి కంకిపాటి వీరన్నపడాల్ అధ్యక్షతన జరిగిన సభలో రుద్రరాజు మాట్లాడారు.
ఉత్తమ్‌వి ఊహాజనిత వ్యాఖ్యలు
ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెలాఖరుకు శాసనసభ రద్దయి రాష్ట్రపతి పాలన వస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసినవి పూర్తిగా ఊహాజనిత వ్యాఖ్యలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ శాసనసభ రద్దయ్యే అవకాశం లేదని, అలాంటప్పుడు రాష్ట్రపతి పాలన ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు. ఉత్తమ్ వ్యాఖ్యలపై ఆయన ఆదివారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ‘శాసనసభ ఎలా రద్దవుతుందో ఉత్తమ్ చెప్పాలి. ఏ ఆధారం లేకుండా ఇలా మాట్లాడడం తగదు. ప్రజాస్వామిక వ్యవస్థలో ఊహాజనిత వ్యాఖ్యలకు తావు లేదు’’ అని వినోద్‌కుమార్ తెలిపారు.
వైకాపా పాలనలో అందరి భవిష్యత్తు నాశనం
న్యాయాధికారి రామకృష్ణ
పెనుకొండ పట్టణం, న్యూస్‌టుడే: ఏపీలో వైకాపా అధికారంలోకి వచ్చాక దళితులకు సంబంధించిన 27 పథకాలను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి గంగలో కలిపేశారని అంబేడ్కర్- ఫులే లేబర్ రైట్స్ ఫోరం వ్యవస్థాపకులు, న్యాయాధికారి సంకు రామకృష్ణ విమర్శించారు. జగన్, వైకాపా నాయకులు రాష్ట్రాన్ని దోచుకొంటూ మరో బిహార్‌లా మార్చేస్తున్నారని.. అందరి భవిష్యత్తును నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్థానం నుంచి న్యాయస్థానం వరకు ఆయన చేపట్టిన శ్రామిక, రైతు, కార్మిక (ఎస్‌ఆర్‌కే) చైతన్యయాత్రలో భాగంగా ఆదివారం శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ తెదేపా కార్యాలయం వద్ద సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రామకృష్ణ మాట్లాడుతూ వైకాపా భూస్వాముల పార్టీ అన్నారు. బహుజనుల పార్టీ తెదేపా అధికారంలో ఉంటేనే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. శాసనసభ, పార్లమెంటులో నోరెత్తని బీసీ, ఎస్టీ, ఎస్సీ నాయకులు మనకు అవసరమా అని ప్రశ్నించారు. తెదేపా అధికారంలోకి రాగానే జగన్ జైలుకెళ్లడం ఖాయమన్నారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి మాట్లాడుతూ వైకాపాకు ఒక్క అవకాశం ఇచ్చినందుకు అభివృద్ధిలో రాష్ట్రం పాతికేళ్లు వెనక్కి వెళ్లిందని విమర్శించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
MLC Election: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధ విజయం
-
General News
TSRTC ఆన్లైన్ టికెట్ బుకింగ్‌లో ‘డైనమిక్ ప్రైసింగ్’!
-
Crime News
TSPSC: పేపర్ లీకేజీ కేసు.. ముగ్గురికి 14 రోజుల రిమాండ్
-
Sports News
Virat Kohli-RCB: విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు చేస్తాడు: ఆకాశ్ చోప్రా
-
World News
US Visa: బిజినెస్, పర్యాటక వీసాపైనా ఇంటర్వ్యూలకు హాజరవ్వొచ్చు
-
Movies News
Nagababu: ‘ఆరెంజ్’ రీ రిలీజ్.. వసూళ్ల విషయంలో నాగబాబు వినూత్న నిర్ణయం