Assembly Elections: అసెంబ్లీ ఎన్నికలపై కరోనా ఎఫెక్ట్‌.. ప్రచార ర్యాలీలపై ఉత్తరాఖండ్‌ నిషేధం

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోన్న వేళ.. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోన్న ఉత్తరాఖండ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రచార ర్యాలీలు, ధర్నాలు,

Published : 08 Jan 2022 11:43 IST

దేహ్రాదూన్‌: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోన్న వేళ.. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోన్న ఉత్తరాఖండ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రచార ర్యాలీలు, ధర్నాలు, ఇతర ప్రదర్శన కార్యక్రమాలపై జనవరి 16 వరకు నిషేధం విధించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 

ఉత్తరాఖండ్‌లో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం 800లకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. పలు ఆంక్షలు విధించింది. ఆ ఆంక్షలు ఆదివారం నుంచి అమల్లోకి రానున్నాయి. జనవరి 16 వరకు ఎన్నికల ర్యాలీలు, సభలపై నిషేధం విధించింది. దీంతో పాటు అంగన్వాడీ కేంద్రాలు, స్కూళ్లు, స్విమ్మింగ్‌ పూల్స్, వాటర్‌ పార్క్‌లను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇక జిమ్‌లు, షాపింగ్‌ మాల్స్‌, సినిమా హాళ్లు, సెలూన్లు, స్పా సెంటర్లు, ఆడిటోరియంలను 50శాతం సామర్థ్యంతో నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఇక ప్రతి రోజు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్‌ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇతర రాష్ట్రాల నుంచి ఉత్తరాఖండ్ వచ్చేవారు రెండు డోసుల టీకా వేసుకోకపోతే తప్పనిసరిగా కొవిడ్‌ నెగెటివ్‌ ధ్రువీకరణ పత్రం చూపించాలని స్పష్టం చేసింది. 

ఉత్తరాఖండ్‌ సహా ఐదు రాష్ట్రాలకు మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశముంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే ప్రచారాలు మొదలుపెట్టాయి. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ ఎన్నికల ప్రచార ర్యాలీలు సూపర్‌ స్ప్రెడర్లుగా మారే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఎన్నికలు వాయిదా వేయాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కానీ, రాజకీయ పార్టీలు మాత్రం ఎన్నికలకు వెళ్లేందుకు సుముఖంగా ఉండటంతో షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహించాలని యోచిస్తున్నట్లు ఈసీ ఇటీవల వెల్లడించింది. ఇదిలా ఉండగా.. ఎన్నికలు ర్యాలీలు వర్చువల్‌గా నిర్వహించే అవకాశం ఉందా..? అని ఇటీవల ఉత్తరాఖండ్‌ హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడిగింది. అంతేగాక, ఆన్‌లైన్‌ ఓటింగ్‌ సాధ్యమవుతుందేమో పరిశీలించాలని తెలిపింది. 

వర్చువల్ ర్యాలీలకు సిద్ధమవుతోన్న కాంగ్రెస్‌

మరోవైపు కరోనా ఉద్ధృతి దృష్ట్యా ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ ఉత్తరప్రదేశ్‌లో అన్ని ప్రచార కార్యక్రమాలను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ప్రత్యామ్నాయ ప్రచారాలపై హస్తం పార్టీ దృష్టిపెట్టింది. త్వరలోనే కాంగ్రెస్‌.. యూపీలో వర్చువల్‌ ర్యాలీలను ప్రారంభించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని