పోల్‌ అప్‌డేట్స్‌: ఓటింగ్‌ శాతం ఎంతంటే 

నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో శాసనసభ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. మొత్తం 475 స్థానాల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో 20 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు

Updated : 06 Apr 2021 10:39 IST

దిల్లీ: నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో శాసనసభ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. మొత్తం 475 స్థానాల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో 20 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తమిళనాడులో తొలి గంటల్లోనే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఓటేశారు. అస్సాం,కేరళ, పుదుచ్చేరిలోని ప్రశాంతంగా పోలింగ్‌ కొనసాగుతుండగా.. పశ్చిమ బెంగాల్‌లో అక్కడక్కడా చెదురుమొదురు ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

ఓటింగ్‌ శాతం ఇలా..

పశ్చిమ బెంగాల్‌లో మూడో విడతలో భాగంగా 31 స్థానాలకు నేడు ఓటింగ్‌ జరుగుతోంది. ఉదయం 9 గంటలకు అక్కడ 14.62శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అస్సాంలో చివరిదశ పోలింగ్‌ ప్రక్రియలో భాగంగా 40 స్థానాలకు ఓటింగ్‌ నిర్వహిస్తున్నారు. తొలి రెండు గంటల్లో రాష్ట్రంలో 12.83శాతం పోలింగ్‌ నమోదైంది. తమిళనాడులో మొత్తం 234 నియోజకవర్గాలకు మంగళవారం ఒకే విడతలో పోలింగ్‌ జరుగుతుండగా.. ఉదయం 9 గంటల వరకు 13.8శాతం ఓటింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. 

బెంగాల్‌లో ఉద్రిక్తతలు..

బెంగాల్‌లో పలు చోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. హూగ్లీలోని తారకేశ్వర్‌లో ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద తమ కార్యకర్తలపై తృణమూల్‌ కార్యకర్తలు దాడి చేశారని భాజపా ఆరోపించింది. డైమ్ండ్‌ హార్బర్‌లోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ప్రజలు ఓటు వేయకుండా తృణమూల్‌ కార్యకర్తలు అడ్డుకుంటున్నారని అక్కడి భాజపా అభ్యర్థి దీపక్‌ హల్దార్‌ ఆరోపించారు. మరోవైపు భాజపా కార్యకర్తలు కొన్ని చోట్ల పోలింగ్‌ కేంద్రాలను తమ అధీనంలోకి తీసుకుంటున్నారని టీఎంసీ నేతలు ఫిర్యాదు చేస్తున్నారు. 

శానిటైజర్లు.. మాస్క్‌లు..

కొవిడ్‌ దృష్ట్యా పోలింగ్‌ కేంద్రాల వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లకు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తున్నారు. కేంద్రాల వద్ద శానిటైజర్లు, మాస్క్‌లు అందుబాటులో ఉంచారు. క్యూలైన్లలో భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని