Delhi civic polls: కట్టుదిట్టమైన భద్రత మధ్య కొనసాగుతున్న దిల్లీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్

Delhi civic polls: కట్టుదిట్టమైన భద్రత మధ్య దిల్లీలో మున్సిపల్‌ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆప్‌, కాంగ్రెస్‌, భాజపా మధ్య త్రిముఖ పోరు నెలకొంది.

Updated : 04 Dec 2022 10:45 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP), భాజపా, కాంగ్రెస్‌ మధ్య త్రిముఖ పోరు నెలకొన్న ఈ ఎన్నికల్లో మొత్తం 1,349 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 250 వార్డుల్లో 1.45 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం దిల్లీ వెలుపల కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది.

ఉదయం 8 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. సాయంత్రం 5:30 గంటల వరకు కొనసాగుతుంది. ‘మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ దిల్లీ (MCD)’లో అవినీతిరహిత పాలనను అందించే పాలకవర్గానికి అవకాశం ఇవ్వాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఓటర్లకు పిలుపునిచ్చారు. దిల్లీని స్వచ్ఛంగా, అందమైన నగరంగా మార్చే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు. మరోవైపు దిల్లీని డంపింగ్‌ యార్డుగా మారుస్తున్న వారికి ఓటెయ్యొద్దని దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా ఓటర్లను కోరారు.

ఈ ఎన్నికల ఫలితాలు డిసెంబరు 7న వెలువడనున్నాయి. ఆప్‌, భాజపా రెండూ గెలుపుపై ధీమాగా ఉన్నాయి. కాంగ్రెస్‌ మాత్రం పూర్వవైభవాన్ని సంతరించుకోవాలన్న ఆకాంక్షతో ఉంది. తాజాగా వార్డుల పునర్విభజన తర్వాత జరుగుతున్న తొలి మున్సిపల్‌ ఎన్నికలు ఇవే. 2020 దిల్లీ అల్లర్ల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కూడా కావడం గమనార్హం. మరోవైపు గుజరాత్‌లో తొలిదశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ పూర్తయింది. సోమవారం రెండో దశ పోలింగ్‌ జరగనుంది. ఆ రాష్ట్రంలో కూడా ఈ మూడు పార్టీల మధ్యే త్రిముఖ పోరు నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ ఎన్నికలకు ప్రాధాన్యం ఏర్పడింది.

కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ కొనసాగుతోంది. 40 వేల మంది దిల్లీ పోలీసులు, 20 వేల మంది హోంగార్డులు, 108 కంపెనీల సీఏపీఎఫ్‌, ఎస్‌ఏపీ బలగాల్ని మోహరించారు. 1958లో ఏర్పాటైన ఎంసీడీని 2012లో అప్పటి ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ హయాంలో మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేశారు. తిరిగి వాటిని ఈ ఏడాది విలీనం చేసి ఎంసీడీగా పునరుద్ధరించారు. ఇది మే 22 నుంచి అమల్లోకి వచ్చింది. 2017 మున్సిపల్‌ ఎన్నికల్లో భాజపా 181 స్థానాల్లో గెలుపొందింది. ఆప్‌ 48, కాంగ్రెస్‌ 27 వార్డుల్ని కైవసం చేసుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని