Gujarat Election Updates: ఓటేసిన ప్రముఖులు.. పోలింగ్‌ శాతం ఇలా..

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌ కొనసాగుతోంది. తొలి గంటల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Updated : 05 Dec 2022 15:30 IST

గాంధీనగర్‌: గుజరాత్‌ (Gujarat) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) తుది విడత పోలింగ్‌ సోమవారం ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 14 జిల్లాల పరిధిలోని 93 నియోజకవర్గాలకు నేడు ఓటింగ్‌ జరుగుతోంది. ఉదయం 11 గంటల వరకు 19.17శాతం పోలింగ్‌ (Gujarat Polling) నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు.  తొలి గంటల్లో పలువురు ప్రముఖులు ఓటేశారు.

* ఈ ఉదయం అహ్మదాబాద్‌లోని రాణిప్‌ ప్రాంతంలో ప్రధాని మోదీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్‌ కేంద్రానికి కాలినడక వచ్చిన ప్రధాని క్యూలైన్‌లో నిల్చుని ఓటెయ్యడం విశేషం.

* అహ్మదాబాద్‌లోని నరన్‌పురా పోలింగ్‌ కేంద్రంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన కుమారుడు, బీసీసీఐ సెక్రటరీ జై షా (Jay Shah) కూడా ఇక్కడే ఓటేశారు.

* గాంధీనగర్‌లో ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్‌ (Heeraben Modi) ఓటు హక్కు వినియోగించుకున్నారు. వందేళ్లు దాటినా ఆమె వీల్‌ఛైర్‌లో పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటేసి యువతకు స్ఫూర్తిగా నిలిచారు. అటు అహ్మదాబాద్‌లో ప్రధాని సోదరుడు సోమభాయ్‌ మోదీ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

* అహ్మదాబాద్‌లోని షీలాజ్‌ అనుపమ్‌ పోలింగ్‌ కేంద్రంలో యూపీ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

* వడోదరలో రాజకుటుంబానికి చెందిన రాజమాత శుభాంగినిరాజే గైక్వాడ్‌ ఓటేశారు.

* విరంగామ్‌లో భాజపా అభ్యర్థి హార్దిక్‌ పటేల్‌ (Hardik Patel) ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో కాషాయ పార్టీ 150 సీట్లతో ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

* ఇక, గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌, దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా కూడా అహ్మదాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని