Pralhad Joshi: కాంగ్రెస్‌ కరెంట్‌ ఇవ్వకపోవడం వల్లే జనాభా పెరిగింది!

Pralhad Joshi Comments on Congress: కాంగ్రెస్‌ పార్టీ సరిగా విద్యుత్‌ ఇవ్వకపోవడం వల్లే జనాభా పెరిగిందని కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి అన్నారు. అలాంటి పార్టీ ఉచిత విద్యుత్‌ ఇస్తామంటే నమ్మొద్దంటూ విజ్ఞప్తి చేశారు.

Published : 09 Mar 2023 20:40 IST

బెంగళూరు: కర్ణాటకలో (Karnataka) అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. రాష్ట్ర నేతలు యాత్రలు, సమావేశాలు నిర్వహిస్తుండగా.. దిల్లీ పెద్దలు సైతం ఆ రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాము అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్‌ (Free elctricity) ఇస్తామని తాజాగా కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. దీనిపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి (Pralhad Joshi) విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ విద్యుత్‌ సరిగా ఇవ్వకపోవడం వల్లే ఇవాళ జనాభా పెరిగిపోయిందంటూ ఓ వింత వాదనను తెరపైకి తెచ్చారు.

‘‘అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్‌ ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ చెబుతోంది. వారు ఉచిత విద్యుత్‌ ఇస్తారంటే మీరు నమ్ముతారా? వారు అధికారంలో ఉన్నప్పుడు అసలు విద్యుత్తే ఇచ్చేవారు కాదు. గ్రామాల్లో విద్యుత్‌ ఉండేది కాదు. మోదీ అధికారంలోకి వచ్చాకే 24 గంటల విద్యుత్‌ అందుబాటులోకి వచ్చింది’’ అని ప్రహ్లాద్‌ జోషి అన్నారు. వారు విద్యుత్‌ ఇవ్వకపోవడం వల్లే కర్ణాటకలో వారి హయాంలో జనాభా పెరిగిందని చెప్పారు.

కర్ణాటకలో ఈ ఏడాది మే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. తాము అధికారంలోకి వస్తే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇస్తామని ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రహ్లాద్‌ జోషి స్పందించారు. మరోవైపు ప్రహ్లాద్‌ జోషి చేసిన ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. సంబంధిత వార్తను రీట్వీట్‌ చేస్తూ నవ్వుతున్న ఎమోజీని దానికి జత చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని