DK Shivakumar vs Siddaramaiah: సిద్ధూ వర్సెస్‌ డీకే: కన్నడనాట ఫ్లెక్సీల వార్‌

సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ వర్గీయుల మధ్య ఫ్లెక్సీ వార్‌ మొదలైంది. తమ నాయకుడికే ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించాలని నేటి ఉదయం పోస్టర్లు, బ్యానర్లు పుట్టుకొచ్చాయి.

Updated : 14 May 2023 15:30 IST

ఇంటర్నట్‌డెస్క్‌: కర్ణాటకలో ఘన విజయం తర్వాత సీఎం పీఠం కోసం కేపీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌, మాజీ సీఎం సిద్ధరామయ్య వర్గీయుల మధ్య పోటీ నెలకొంది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఇరు పక్షాల మధ్య ఫ్లెక్సీల వార్‌ మొదలైంది. ఆదివారం ఉదయం బెంగళూరులో ఇరువురి అభిమానులు పలు రకాల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సీఎం పదవిలో తమ అభిమాన నాయకుడే ఉండాలని కోరారు. రాష్ట్ర ఎన్నికల సమయంలో ఇరువర్గాలు ఏకతాటిపై నడిచి పార్టీకి విజయాన్ని అందించేందుకు కృషి చేశాయి. కానీ, ఫలితాల అనంతరం తమ నాయకుడికి అనుకూలంగా ప్రకటనలు చేయడం మొదలుపెట్టారు. శనివారం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర మాట్లాడుతూ తన తండ్రి సీఎం పోస్టుకు అర్హుడని పేర్కొన్నారు. మరోవైపు డీకే శివకుమార్‌ సోదరుడు సురేష్‌ మాట్లాడుతూ తన సోదరుడిని ముఖ్యమంత్రి చేస్తే రాష్ట్రం సంతోషిస్తుందని వ్యాఖ్యానించారు. 

నేటి సాయంత్ర 5.30కు సీఎల్‌పీ భేటీ కానుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. ఈ నేపథ్యంలో  కొత్తగా ఎన్నికైన వారంతా నేటి సాయంత్రానికి బెంగళూరు చేరుకోవాలని పార్టీ హైకమాండ్‌ ఆదేశాలు జారీ చేసింది.

‘కనకపుర బండ’గా అభిమానులు పిలిచే 62 ఏళ్ల డీకే శివకుమార్‌ కర్ణాటక కాంగ్రెస్‌కు వేగాన్ని అందించిన నేత. కాంగ్రెస్‌ ట్రబుల్‌ షూటర్‌గా గుర్తింపు పొందిన డీకే 2017 వరకు ఓ సాధారణ నాయకుడే. ఆ ఏడాది ఆగస్టులో గుజరాత్‌కు చెందిన అహ్మద్‌ పటేల్‌ రాజ్యసభ సభ్యుడిగా గెలిచేందుకు అవసరమైన ఎమ్మెల్యేలకు బెంగళూరులో విడిది ఏర్పాటు చేసి అధిష్ఠానం దృష్టిలో పడ్డారు. ఏఐసీసీ అధ్యక్షుడు, రాహుల్‌, సోనియా గాంధీల అండదండలున్నాయి.

ఇక రాష్ట్ర రాజకీయాల్లో మంచి పేరున్న నేతల్లో సిద్ధరామయ్య ప్రముఖుడు. దేవరాజ్‌ అరసు తర్వాత ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసింది ఆయనే. అహింద (బలహీనవర్గాల) సముదాయానికి ప్రతినిధిగా ఉండేందుకు ఇష్టపడే ఆయన జనతా పరివార్‌ నుంచి 2006లో కాంగ్రెస్‌లోకి వచ్చారు. జనతాదళ్‌లోనూ ఉప ముఖ్యమంత్రిగా, ఆర్ధిక మంత్రిగా పని చేసిన సిద్ధరామయ్య ఇప్పటి వరకు అత్యధిక సార్లు (13సార్లు) బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత సొంతం చేసుకున్నారు. 2013లో కాంగ్రెస్‌కు 122 స్థానాల విజయాన్ని అందించడంలో సిద్ధరామయ్య పాత్రను విస్మరించని అధిష్ఠానం ముఖ్యమంత్రి బాధ్యతలను అప్పగించింది. అపార రాజకీయ అనుభవం ఉన్న సిద్ధరామయ్య.. పార్టీని, ప్రభుత్వాన్ని ఒంటిచేత్తో నడపగలరు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు