Politics: గోవా, మణిపుర్‌ ముఖ్యమంత్రులుగా వారికే అవకాశం..!

హోలీ తర్వాత రెండోసారి ముఖ్యమంత్రులుగా ప్రమోద్‌ సావంత్‌, బీరేన్‌ సింగ్‌లు ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Published : 16 Mar 2022 18:52 IST

భారతీయ జనతా పార్టీ వర్గాల వెల్లడి

దిల్లీ: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయా రాష్ట్రాల్లో కొత్త ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో గోవా, మణిపుర్‌లో మాత్రం ముఖ్యమంత్రి మార్పు ఉండవచ్చనే ఊహాగానాలు వెలుబడ్డాయి. ఈ నేపథ్యంలో గోవా ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌, మణిపుర్‌ సీఎం బీరేన్‌ సింగ్‌లు ప్రధాని మోదీతో వరుసగా భేటీతో అయ్యారు. ఇద్దరు నాయకులతో సంప్రదింపుల అనంతరం రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతమున్న సీఎంలనే కొనసాగించాలని భాజపా నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీంతో హోలీ తర్వాత రెండోసారి ముఖ్యమంత్రులుగా ప్రమోద్‌ సావంత్‌, బీరేన్‌ సింగ్‌లు ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నాలుగు రాష్ట్రాల్లో జయకేతనం ఎగరవేసింది. అయితే, ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎంగా రెండోసారి యోగీ ఆదిత్యనాథ్‌ కొనసాగుతారనే విషయంపై స్పష్టత ఉన్నప్పటికీ.. గోవా, మణిపుర్‌ రాష్ట్రాల్లోనే నాయకత్వ మార్పుపై భాజపా చర్చిస్తున్నట్లు వార్తలు వెలుబడ్డాయి. మణిపుర్‌లో ఎన్నికల ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిని భాజపా ప్రకటించలేదు. దీంతో బిశ్వజిత్‌ సింగ్‌, కొంతౌజమ్‌ గోవింద్‌ దాస్‌ వంటి పేర్లు సీఎం రేసులో వినిపించాయి. మరోవైపు గోవాలోనూ ప్రమోద్‌ సావంత్‌ కాకుండా మరో మంత్రికి సీఎంగా అవకాశం ఇవ్వవచ్చనే ఊహాగానాలు వెలుబడ్డాయి. వీటన్నింటికీ స్వస్తి చెబుతూ ప్రస్తుతమున్న సీఎంలనే కొనసాగించాలని భాజపా నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

ఇదిలాఉంటే, గోవాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 20 స్థానాల్లో (మొత్తం 40) గెలుపొందిన భాజపా, అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్‌ మాత్రం 11 స్థానాలకే పరిమితమైంది. ఇక మణిపుర్‌లో 60 స్థానాలకుగానూ 32సీట్లలో గెలుపొంది ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీని భాజపా సాధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని