బిగ్‌ బ్రేకింగ్‌: కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు ప్రశాంత్‌ కిశోర్‌ ‘నో’

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు నిరాకరించారు. ఈ విషయాన్ని.....

Updated : 26 Apr 2022 16:51 IST

దిల్లీ: ప్రముఖ రాజకీయ వ్యూహకరక్త ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే) కాంగ్రెస్‌ పార్టీలో చేరిక దాదాపు ఖాయమైందంటూ ప్రచారం జరుగుతున్న వేళ కీలక మలుపు చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు పీకే నిరాకరించినట్టు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్‌సింగ్‌ సూర్జేవాలా వెల్లడించారు. 2024 ఎన్నికలకు సన్నద్ధత కోసం కాంగ్రెస్‌ పార్టీకి పీకే ఇచ్చిన ప్రజెంటేషన్‌పై చర్చించిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ యాక్షన్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. అయితే, ఆ సాధికారిత కమిటీలో ఉండేందుకు పీకే అంగీకరించలేదని.. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించగా నిరాకరించారని సూర్జేవాలా తెలిపారు. తమ పార్టీ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషిని, పార్టీకి ఇచ్చిన సూచనల్ని తాము అభినందిస్తున్నట్టు సూర్జేవాలా తన ట్విటర్‌లో పేర్కొన్నారు. 

నేను సలహాదారుగా పనిచేయడమే అవసరం: పీకే

మరోవైపు, ఇదే అంశంపై ప్రశాంత్‌ కిశోర్‌ కూడా ట్వీట్ చేశారు. సాధికారత కమిటీలో చేరాలని, ఎన్నికల బాధ్యత తీసుకోవాలంటూ కాంగ్రెస్‌ చేసిన ఉదారమైన ప్రతిపాదనను తిరస్కరించినట్టు వెల్లడించారు. నిర్మాణపరమైన సమస్యల్లో పాతుకుపోయిన కాంగ్రెస్‌ పార్టీకి తన అవసరం కన్నా నాయకత్వం, సమష్టి సంకల్పం అవసరమని పేర్కొన్నారు. తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరడంలేదనీ.. ఆ పార్టీకి సలహాదారుగా మాత్రమే పనిచేస్తానని స్పష్టంచేశారు. తాను పార్టీలో చేరడం కంటే సలహాదారుగా పనిచేయడమే అవసరమన్నారు. కాంగ్రెస్‌ మూలాల నుంచి పునర్నిర్మాణం జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆహ్వానాన్ని ఆమోదించలేకపోతున్నట్టు తెలిపారు.

ప్రశాంత్‌ విషయంలో కాంగ్రెస్‌లో సాగిన తర్జనభర్జనలు!

మరోవైపు, ఎన్నికల్లో వరుస ఓటములతో సతమతమవుతోన్న కాంగ్రెస్‌తో మరోసారి కలిసి పనిచేసేందుకు పీకే ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల పలుమార్లు పార్టీ అధిష్ఠానంతో సమావేశమైన ప్రశాంత్‌ కిశోర్‌.. 2024 సార్వత్రిక ఎన్నికలు, ఈ ఏడాది జరగబోయే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు చేశారు. దీంతో పీకే ఎన్నికల వ్యూహాలు, నివేదికపై అధ్యయనం చేసేందుకు సోనియా గాంధీ కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం నేతృత్వంలో ఓ కమిటీ వేశారు. ఈ కమిటీ తమ నివేదికను సోనియాకు అందజేసింది. ప్రశాంత్‌ కిశోర్‌ను పార్టీలో చేర్చుకోవడంపై కాంగ్రెస్‌లో కొంత కాలంగా తర్జనభర్జనలు కొనసాగాయి. ఆయన రాక పార్టీ పునరుత్థానానికి అత్యంత అవసరమని కొందరు నేతలు అభిప్రాయపడగా.. ఇతర పార్టీలతో సంబంధాలను పూర్తిగా తెంచుకుంటేనే చేరికకు అనుమతించాలని మరికొందరు వాదిస్తూ వచ్చారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసంలో సోమవారం పలువురు సీనియర్‌ నాయకులు ఇదే అంశంపై చర్చించారు. పార్టీ పునరుత్థానం కోసం ప్రశాంత్‌ కిశోర్‌ సమర్పించిన ప్రణాళికపైనా మంతనాలు జరిపారు. ప్రియాంకాగాంధీ వాద్రా, అంబికా సోని వంటివారు పార్టీలో ఆయన చేరికకు సుముఖంగా ఉండగా.. దిగ్విజయ్‌సింగ్‌, ముకుల్‌ వాస్నిక్‌, రణదీప్‌ సుర్జేవాలా, జైరాం రమేశ్‌ ప్రస్తుతానికి విముఖత వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. వైకాపా, తెరాస, తృణమూల్‌ కాంగ్రెస్‌ వంటి ఏ ఇతర రాజకీయ పార్టీకీ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయొద్దంటూ షరతు విధించి, అందుకు అంగీకరిస్తేనే ప్రశాంత్‌ కిశోర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవాలనే అభిప్రాయాలు ఈ భేటీలో ఎక్కువగా వ్యక్తమైనట్లు ప్రచారం జరిగింది. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ (తృణమూల్‌ కాంగ్రెస్‌), ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి (వైకాపా)లకు ఆయన రాజకీయ సలహాదారుగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన సంస్థ- ఐప్యాక్‌ తెలంగాణలో తెరాసతో కలిసి పనిచేసేందుకూ తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. ఇలా ప్రత్యర్థి పార్టీలతో ఒప్పందాలు కొనసాగితే.. కాంగ్రెస్‌ పునరుత్థాన ప్రణాళికల అమలులో ఇబ్బందులు ఎదురవుతాయని దిగ్విజయ్‌ తదితరులు అభిప్రాయపడినట్లు వార్తలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పీకే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని