Prashant Kishor: గాంధీలను కలిసిన ప్రశాంత్‌.. మళ్లీ ఊపందుకున్న ఊహాగానాలు..!

వరుస ఓటములతో ప్రాభవం కోల్పోతోన్న కాంగ్రెస్ పార్టీ.. తిరిగి పునర్వైభవాన్ని సంతరించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

Updated : 16 Apr 2022 14:42 IST

త్వరలో తేలనున్న వ్యూహకర్త పాత్ర

దిల్లీ: వరుస ఓటములతో ప్రాభవం కోల్పోతోన్న కాంగ్రెస్ పార్టీ.. తిరిగి పునర్వైభవాన్ని సంతరించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో సమావేశమయ్యారు. దీంతో ఆయన పార్టీలో చేరతారని మరోసారి వార్తలు వినిపిస్తున్నాయి. 

2024 సార్వత్రిక ఎన్నికలతో సహా మున్ముందు జరగబోయే రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ గాంధీలతో చర్చలను పున: ప్రారంభించారు. త్వరలో జరగబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఈ చర్చ అని కాంగ్రెస్ వర్గాలు చెప్పగా.. సార్వత్రిక ఎన్నికల్లో ముందుకు వెళ్లాల్సిన విధానంపై ఈ భేటీ జరిగిందని కిశోర్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. మరోపక్క.. పార్టీలో సీనియర్‌ నేతలను అసంతృప్తికి గురిచేయకుండా మార్పులు తీసుకురావాలని గాంధీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ప్రశాంత్ ఆలోచన మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నట్లు సమాచారం. ఇంతకీ ఆయన పార్టీలో చేరతారా, సలహాదారుగా ఉంటారా అనేది కొద్ది రోజుల్లో తేలనుంది. 

గత ఏడాది కాంగ్రెస్ అధిష్ఠానం, ప్రశాంత్ కిశోర్ మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఆ తర్వాత కిశోర్ కాంగ్రెస్, రాహుల్ గాంధీపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. అయితే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి తర్వాత.. మరోసారి వారు కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పార్టీలో కీలకంగా వ్యవహరించాలని ప్రశాంత్ కోరుకుంటుండగా.. తమ నిర్ణయాలతో సీనియర్లు ఇబ్బంది పడకూడదని కాంగ్రెస్ భావిస్తోంది. ఇలా ఎవరి వైఖరికి వారు కట్టుబడి ఉంటే.. ఈసారి కూడా వారు కలిసి ముందుకు సాగే అవకాశం కార్యరూపం దాల్చకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని