Prashant Kishor: కాంగ్రెస్‌లోకి ప్రశాంత్‌ కిశోర్‌ చేరిక ఖాయమైనట్లేనా..?

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ నేడు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరుతారనే

Published : 17 Apr 2022 02:14 IST

దిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ నేడు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం మళ్లీ జోరందుకుంది. అయితే అది ఖాయమేనని తెలుస్తోంది. పీకేను ఎన్నికల వ్యూహకర్తగా కాకుండా పార్టీలోనే చేరాలని కాంగ్రెస్‌ కోరినట్లు ఆ పార్టీ విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీనికి ఆయన కూడా ఆసక్తి చూపించినట్లు సమాచారం.

ప్రశాంత్‌ కిశోర్‌ నేడు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, పలువురు పార్టీ సీనియర్‌ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పీకేను కాంగ్రెస్‌లో చేరాలని పార్టీ హైకమాండ్‌ అడిగినట్లు సదరు వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే ఆయన కాంగ్రెస్‌లో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక, 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కూడా ప్రశాంత్‌ ఓ కీలక ప్రజెంటేషన్‌ ఇచ్చినట్లు సమాచారం. ఆ ఎన్నికల్లో 370 నుంచి 400 సీట్లను లక్ష్యంగా పెట్టుకోవాలని పీకే సూచించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఏయే రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ బలహీనంగా ఉందో.. అక్కడ వ్యూహత్మక కూటములను ఏర్పాటు చేసుకోవాలని చెప్పినట్లు పేర్కొన్నాయి.

ఈ భేటీ అనంతరం కేసీ వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రశాంత్‌ కిశోర్‌ ఇచ్చిన సూచనలను పరిశీలిస్తున్నాం. వాటిని ముందుకు తీసుకెళ్లేందుకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నాం’’ అని తెలిపారు. ఈ సమావేశంలో సీనియర్‌ నేతలు మల్లికార్జున్‌ ఖర్గే, అంబికా సోనీ, అజయ్‌ మాకెన్‌, ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొన్నారు.

గత ఏడాది కాంగ్రెస్ అధిష్ఠానం, ప్రశాంత్ కిశోర్ మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఆ తర్వాత కిశోర్ కాంగ్రెస్, రాహుల్ గాంధీపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. అయితే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి తర్వాత.. మరోసారి వారు కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా ఈ ఏడాది చివర్లో జరిగే గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిపెట్టిన కాంగ్రెస్‌.. ఇందుకు పీకే సాయం తీసుకోవాలని భావిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని